KCR vs Governor: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వార్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది.
రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘనను గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ ఎంత అవమానించినా మౌనంగా భరిస్తూ వచ్చిన గవర్నర్ బుధవారం కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో ప్రగతిభవన్, రాజ్‌భవన్ పంచాయతీ ఇప్పుడు ప్రధాని వద్దకు చేరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కార్యాలయం నుంచి వచ్చిన పిలుపుతో బుధవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. తెలంగాణతోపాటు, పుదుచ్చేరిలోని పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహిండాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నివేదకి అందించారు.
-తెలంగాణ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థపై గౌరవం లేదు..
పంటి నొప్పికి ఢిల్లీలో ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రగతిభవన్ కు, రాజ్‌భవన్ కు మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్‌ను రాష్ట్రంలో ఎవరూ పట్టించు కోవద్దు అన్నట్లుగా కేసీఆర్ హుకూం జారీ చేశారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు కూడా గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించడం లేదు. ఇటీవల సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లిన సందర్భంగా మంత్రులతోపాటు అధికారులెవరూ ఆమెకు స్వాగతం పలికేందుకు రాలేదు. తాజాగా ఉగాది సందర్భంగా గవర్నర్ యాదాద్రి వెళ్లారు. ఈ సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఈవో గీతకు ముందస్తు సమాచారం అందించారు. అప్పటి వరకు ఆలయంలో ఉన్న ఈవో గీత గవర్నర్ వస్తున్నారని తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్చకులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. గవర్నర్ యాదాద్రి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈవో తిరిగి ఆలయానికి వచ్చారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీకి తొత్తులుగా మారడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ, శాసన మండలి స్పీకర్లు కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ ఆ పదవి గౌరవం పెంచాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ అన్ని అంశాలపై తమిళిసై ప్రధాని నరేంద్రమోదీనికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ వ్యవస్థపై రాష్ట్రంలో ఎవరూ గౌరవించడం లేదని నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. తనను గౌరవించకపోయినా.. గవర్నర్ హోదాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ మీడియాతో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
-తెలంగాణ సీఎస్‌పై ఫిర్యాదు..
రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం తీరుపై కేంద్రానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రా కేడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్ తెలంగాణలో పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. బిహార్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటిని పట్టించుకోని గవర్నర్ తాజాగా తన ప్రొటోకాల్ విషయాన్ని సీఎస్ లెక్కచేయకపోవడంతో ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సీఎస్ కూడా తన ప్రొటోకాల్‌ను పట్టించుకోవడం లేదని పేర్కొనడం… మరోసారి ప్రొటోకాల్ విషయంలో ఇలా జరుగకూడదు అని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
-నేను వ్యక్తిగత విమర్శలు చేయలేదు…
గవర్నర్‌గా తాను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తున్నానని తమిళిసై సౌందర్యరాజన్ తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగ బద్ధంగా తాను పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారిని అందరూ గౌరవించాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది జరుగడం లేదు. తెలంగాణ పరిస్థితులు ప్రధాని నరేంద్రమోదీకి తెలుసు. కేసీఆర్‌తో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించాను. నేను కాంట్రవర్సీ పనర్సన్‌ను కాదు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నేను అధికారం చెలాయించడం లేదు. నన్నెవరూ ఆపలేరు. ప్రధానితో అన్ని విషయాలు చెప్పాను. సీఎం కేసీఆర్ తనను కలిసేందుకు ఎప్పుడైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు’ అని తెలిపారు.
-సర్కార్ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలి..
‘తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కరువయ్యాయి. రోగులకు సరైన వైద్యం అందడం లేదు.. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూ వార్డులో రోగిని ఎలుకలు కరవడం ఆస్పత్రుల పరిస్థితికి అద్దం పడుతోంది’ అని గవర్నర్ తమిళిసై ప్రధానికి తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రధానిని కోరినట్లు గవర్నర్ తెలిపారు.
-భద్రాద్రి వెళ్తాను: గవర్నర్
ఈనెల 11, 12 తేదీల్లో భద్రాచలం రామాలయానికి వెళ్తానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ప్రొటోకాల్ వివాదం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్ త్వరలో తన పర్యటన వివరాలను మీడియా ముఖంగా ప్రకటించడం గమనార్హం. గవర్నర్ పర్యటనను సాధారణంగా రాజ్‌భవన్ కార్యాలయ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం ఇస్తాయి. అయితే రాష్ట్రంలో సీఎస్ ప్రొటోకాల్‌ను పక్కన పెడుతున్నట్లు గుర్తించిన గవర్నర్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం తన తర్వాత పర్యటన గురించి ప్రకటన చేశారు. మరి ఈసారి ప్రొటోకాల్ పాటిస్తారా? లేదా వేచి చూడాలి.