KCR Jama Thanda: కేసీఆర్ సార్.. మీరు నిద్రించిన తండా పరిస్థితి ఇదీ

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని జామ తండాలో 15 సంవత్సరాల క్రితం అంటే 2008 ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఉద్యమ నాయకుడిగా పర్యటించారు.

Written By: K.R, Updated On : August 11, 2023 5:43 pm

KCR Jama Thanda

Follow us on

KCR Jama Thanda: “పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. గిరిజనుల బతుకులను మార్చాం. తండాలను పంచాయతీలు చేశాం. సర్పంచ్ కొలువులు వాళ్లకే ఇచ్చాం.” గిరిజన సంక్షేమంపై ఆ మధ్య జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఇవి. పైకి చూస్తే బాగానే కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. సాక్షాత్తు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బస చేసిన తండాలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తండా రూపురేఖలు మారుస్తానని అప్పట్లో ఆ గిరిజనులకు హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని జామ తండాలో 15 సంవత్సరాల క్రితం అంటే 2008 ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఉద్యమ నాయకుడిగా పర్యటించారు. ఇందులో భాగంగా ఓ గిరిజనుడు భోజ్యా నాయక్ ఇంట్లో బస చేశారు. వారు పెట్టిన జొన్న రొట్టెలు తిన్నారు. ఆతిథ్యం స్వీకరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఆతిధ్యం ఇచ్చిన ఈ ఇంటి రూపురేఖలు మారుస్తానని వారికి హామీ ఇచ్చారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తండాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కెసిఆర్ కు ఆరోజు రాత్రి ఆతిథ్యం ఇచ్చిన భోజ్యా నాయక్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఇంతవరకు మారలేదు. నాడు కేసీఆర్ బస చేసిన ఇంటి రూపురేఖలు మారలేదు. పైగా ఇటీవల కురిసిన వర్షానికి ఆ ఇల్లు కురుస్తోంది. ఇంటి గోడ ఒకవైపు కూలిపోవడంతో వాళ్లు రేకులను ఆసరాగా పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. నాడు కెసిఆర్ కు ఆతిధ్యం ఇచ్చిన భోజ్యనాయక్ కుమారుడు నారాయణ తన ముగ్గురు కూతుర్ల తో కలిసి ఆ రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ ముగ్గురి కూతుర్లను పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు. కేసీఆర్ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి గాని, ప్రభుత్వం గాని తమ తండాను అభివృద్ధి చేయలేదని నారాయణ చెబుతున్నారు. తండాలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదని, కనీసం తండాకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. గిరిజన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, గిరిజన మంత్రి మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తమ బతుకులు మారలేదని నారాయణ వాపోతున్నాడు.