
తెలంగాణలో మరో అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతమైంది. శుక్రవారం కొండపోచమ్మ సాగర్ జలశయం వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసిన సంగతి తెల్సిందే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు 250 కిలోమీటర్లు పయనించి కొండపోచమ్మ సాగర్ ను ముద్దాడాయి.
కొండపోచమ్మ సాగర్ విశేషాలు..
-తెలంగాణలో అత్యంత ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ కొండపోచమ్మ సాగర్.
– కాళేశ్వరం జలాలు సముద్ర మట్టానికి 618మీటర్ల ఎత్తున్న కొండపోచమ్మ సాగర్లోకి చేరుతున్నాయి.
-కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 15 టీఎంసీలు.
– ఈ జలాశయం కింద ఐదు జిల్లాల్లోని 2.85లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందనుంది.
– కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అతిపెద్ద జలాశయం
-మేడిగడ్డ నుంచి మరో 518 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు.
– ఈ జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా పంట పొలాలకు నీటిని అందించవచ్చు. చెరువులను నింపొచ్చు.
-ఈ జలాశయం పనులను 2018 జనవరిలో ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేశారు.
-కొండపోచమ్మ రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
-సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు నుంచే నీరందనుంది.
– 0.65 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఆరు పంపులతో రెండు లిప్టులు నిర్మించారు.
-ఈ లిఫ్టుల కోసం రూ.2100 కోట్లు ఖర్చుపెట్టారు.
– మరో 25రోజుల్లో కొండపోచమ్మ జలాశయం నిండుకుండలా మారనుంది.