కరోనా ఎఫెక్ట్ తో భారత్ లో కేంద్రం లాక్‌డౌన్ చర్యలను చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించింది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్ ఆదేశాలతో పకడ్బంధీ చర్యలు తీసుకుంటుంది. లాక్‌డౌన్ పై అధికారులు తీసుకున్న చర్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు సమీక్షించనున్నారు.
ఆదివారం ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుకు ప్రజలంతా మద్దతు తెలిపారు. ఎవరికీ వారు ఇళ్లకు పరిమితమై సంఘీభావం తెలిపారు. అయితే సోమవారం నాటికి ప్రజలంతా రోడ్లపై రావడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. దీంతో ఆయా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుపై కఠిన చర్యలు తీసుకుంటుంది. మంగళవారం నాటికి లాక్‌డౌన్ రెండోరోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్లో నిర్వహించే సమావేశంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరా, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొననున్నారు.
కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ వల్ల కలిగే ఇబ్బందులను ఈ సమీక్షలో ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిసింది. సాయంత్రం విలేకరుల నిర్వహించి వివరాలను సీఎం వెల్లడించనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైతే మంచిదని పలువురు సూచిస్తున్నారు.