జలం కోసం ఫైట్: ఏపీకి ధీటుగా కేసీఆర్ దూకుడు

అన్నాదమ్ములు సీఎంలు కేసీఆర్, జగన్ లు విడిపోయారు. సోదరభావంతో ఉండే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాలు చిచ్చుపెట్టాయి. కృష్ణా నది పరివాహకంలో లేని రాయలసీమకు జగన్ భగీరథుడిగా మారి నీళ్లిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కేసీఆర్ వద్దన్నాడు.. అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చివరకు జగన్ తొడగొడితే.. కేసీఆర్ ఊరికే ఉండలేదు. అసలు ఆ రాష్ట్రం దాకా నీళ్లు వెళ్లకుండే ఇక్కడే గండికొడుతానంటున్నాడు. ఏపీ, తెలంగాణ మధ్య ముదిరిన జల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.. *అసలేంటి కృష్ణానదీ […]

Written By: Neelambaram, Updated On : May 17, 2020 9:07 pm
Follow us on


అన్నాదమ్ములు సీఎంలు కేసీఆర్, జగన్ లు విడిపోయారు. సోదరభావంతో ఉండే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాలు చిచ్చుపెట్టాయి. కృష్ణా నది పరివాహకంలో లేని రాయలసీమకు జగన్ భగీరథుడిగా మారి నీళ్లిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కేసీఆర్ వద్దన్నాడు.. అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చివరకు జగన్ తొడగొడితే.. కేసీఆర్ ఊరికే ఉండలేదు. అసలు ఆ రాష్ట్రం దాకా నీళ్లు వెళ్లకుండే ఇక్కడే గండికొడుతానంటున్నాడు. ఏపీ, తెలంగాణ మధ్య ముదిరిన జల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది..

*అసలేంటి కృష్ణానదీ జల వివాదం..
శ్రీశైలం కుండలో నీళ్లు పొంగిపోర్లినప్పుడే.. వరద నీరు వచ్చినప్పుడే నీరు రాయలసీమకు వాడుకుంటామని చెబుతున్న జగన్ సర్కార్.. ఏకంగా ఆ కుండకే చిల్లు పెడుతోంది. కుండ అట్టడుగున ఉన్న నీళ్లను కూడా ఒక్క చుక్క లేకుండా ఖాళీ చేసే దోపిడీ తెగించింది. పోతిరెడ్డిపాడుకు నాలుగు కీలోమీటర్ల దూరం నుంచి నీటి ఎత్తిపోసే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని రాయలసీమకు ఎత్తిపోసేందుకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాలు శ్రీశైలం జలాశయంలోకి రాకముందే ఎగువ ప్రాంతం నుంచే ప్రతీ నీటి బొట్టును వచ్చింది వచ్చినట్టు శ్రీశైలం కుడికాలువ ద్వారా సీమకు మళ్లించేందుకు తాజాగా పెద్ద స్కెచ్ వేసింది. దీంతో శ్రీశైలంకు, నాగార్జున సాగర్ కు నీరు రాకుండా.. అవి నిండకుండానే కృష్ణా నీటిని ఏపీ తరలించడానికి సిద్ధమైంది. వరద జలాలనే తరలిస్తామన్న ఏపీ మాట ఇది వట్టి బూటకమని చెప్పక తప్పదు. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాటు నిండితే మిగిలేవి వరద జాలలు. అప్పుడే తీయాలి. కానీ ముందే తీస్తూ సీమకు తరలిస్తోంది. ప్రధానంగా శ్రీశైలం వదల జలాలపై ఆధారపడ్డ ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల అవసరాలు దెబ్బతించాయి. ఈ ఏపీ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. మిషన్ భగీరత తాగునీటికి కరువు తప్పదు. 6.40 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ద్వారా ఇప్పటికే శ్రీశైలంలో 790 అడుగుల వరకు నీళ్లను ఏపీ తరలిస్తోంది. 834 అడుగులు మెయింటేన్ చేయాలన్న కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఏపీ అమలు చేయడం లేదు.

* అలెర్ట్ అయిన కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎగువన నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని రాయలసీమకు ఎత్తిపోయాలని నిర్ణయించి పథకం జీవో విడుదల చేసిన మరుక్షణం తెలంగాణ సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. కృష్ణా నదిపై తెలంగాణ వాటా నీళ్లకు అన్యాయం జరుగుతుందని కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీతో జలయుద్ధంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించారు.

*జూరాల ప్రాజెక్టు వద్ద మరో ఎత్తిపోతల
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద ప్లాన్ వేశారు. కృష్ణా నది నీళ్లను సమర్థంగా తెలంగాణకు వాడుకోవాలని ఏకంగా జూరాల ప్రాజెక్టు వద్ద మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు ఎగువన 15 -20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం నిపుణుల నుంచి నివేదిక కోరింది. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ దీనిపై సమీక్షించారు.

*గూడెం దొడ్డి, ద్యాగా దొడ్డి వద్ద ప్రాజెక్టుకు అనుకూలం
నిపుణులు ఇప్పటికే థరూర్ మండలం గూడెందొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల మధ్య కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా నీటి పారుదల శాఖ నివేదికను ఇచ్చింది. రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. 20 టీఎంసీల రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు, భీమా1, భీమా2, కోయిల్ సాగర్ కు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. 30 రోజుల్లోనే 15-20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపొందించనున్నారు. ఎక్కువ ముంపు లేకుండా ఈ ప్రాజెక్టును అనువైన చోట డిజైన్ చేస్తున్నారు.

*ఉమ్మడి మహబూబ్ నగర్ లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఏకంగా 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఆదివారం ఈ విషయమై కేసీఆర్ ప్రకటించనున్నారు.

*ఏపీ ప్రాజెక్టుకు ధీటుగా తెలంగాణ ప్లాన్
ఏపీ ఎత్తుకు పైఎత్తును కేసీఆర్ వేస్తున్నారు. కృష్ణానది నుంచి శ్రీశైలం దగ్గర నుంచి తీసుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. దానికి కేసీఆర్ దానికంటే ముందే జూరాల నుంచే ఏపీకి నీరు వెళ్లకుండా అడ్డకట్ట వేయాలి చూస్తున్నారు. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించాలన్న ఏపీ ప్లాన్ కు ధీటుగా తెలంగాణ అదే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టులను రూపొందిస్తోంది. ఏపీ కంటే ముందున్న తెలంగాణ కృష్ణ జలాలను కరువు జిల్లా అయిన మహబూబ్ నగర్, నల్గొండలకు అందించడానికి మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతోంది. దీంతో ఏపీకి ధీటుగా తెలంగాణ ప్లాన్ చేస్తోంది.

-నరేశ్ ఎన్నం