KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదీ సరిగా చెప్పరు. ఒక వేళ చెబితే అది తప్పకుండా చేసి చూపుతారు. చిన్న హింట్ ఇచ్చి ప్రజలను ఆలోచనలో పడేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేర్పరి. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లోనూ ఇలాగే వ్యూహం రచించారు ఆయన. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశంలోనూ కొన్ని వ్యూహాత్మక అంశాలను వెల్లడించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, దళితబంధు, ఇతర అంశాలపై చాలాసేపే చర్చ కొనసాగించారు. వచ్చే ప్రభుత్వం మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ మాటలు ప్రజలను, ఇతర పార్టీల నాయకులను ఆలోచనలో పడేశాయి. ఇంతగట్టిగా వచ్చే ప్రభుత్వం తమదేనని ఎలా చెబుతున్నారు? ఉద్యోగాల గురించి ఇప్పటి వరకు మంత్రులు హరీశ్, కేటీఆర్ మాత్రమే ప్రకటనలు చేయగా.. తొలిసారి సీఎం కేసీఆర్ కూడా మాటిచ్చారు. ఇవన్నీ ఆలోచిస్తే.. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వ్యూహం రచిస్తున్నట్లు అర్థం అవుతోంది.

.. ఎందుకంటే.. సీఎం కేసీఆర్ చెప్పిన పథకాలు ఇప్పటికే ప్రారంభం కాగా.. వాటిని మరింత అభివృద్ధి చేయాలని .. ప్రజలకు చేరువలో ఉంచుతామని చెప్పుకొచ్చారు. బీజేపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు వచ్చే ప్రభుత్వం కూడా మాదే అని.. మీరు ఎలాగూ గెలిచే అవకాశమే లేదు.. సో.. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. ఇప్పుడు మిగిలిన పనులు అప్పటి వరకైనా పూర్తి చేస్తామని అన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగ నియామకాలపై నోరెత్తని కేసీఆర్ ఇప్పుడు వచ్చే మూడు నెలల తరువాత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దళితబంధును అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని చెప్పిన ఆయన ఒక్కో నియోజకవర్గంలో 100మందికి అందిస్తామని చెప్పారు. ఆ తరువాత బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని.. అందుకు ముందే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దళితబంధు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కీలకంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ ప్రజలకు దళితబంధును మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు 10మంది లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమకాగా.. మిగితావారి ఖాతాల్లో జమైన సొమ్మును అధికారులు ఫ్రీజింగ్ లో ఉంచారు. వాసాల మర్రిలోనూ దాదాపు అందరికి దళితబంధు సొమ్ము జమకాగా.. మరో పదిమందికి వివిధ కారణాలతో డబ్బులు పడలేదు. అయితే దళితబంధుపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా.. దీన్నే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. తద్వారా నియోజకవర్గంలో 500మంది దళితులకు పథకం అదించి.. వచ్చే ఎన్నికలలోపు కొన్ని వర్గాల ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోవాలని వ్యూహం పన్నుతున్నారు.
అయితే.. కేసీఆర్ ఇదీ కొత్తేం కాదు.. 2018 ఎన్నికలు కూడా ముందస్తుగా జరిగినవే. 2019లో జరగాల్సి ఉండగా.. పక్కా వ్యూహంతో ప్రజలు డైవర్ట్ కావొద్దని అనుకుని ఆరుమాసాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. వ్యూహం ఫలించింది. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఢిల్లీ టూర్లు. లోకల్ గా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తప్పనిసరి.. ఇదే క్రమంలో అమిత్ షాను కలిసినట్లు సమాచారం. అయితే అప్పటికీ.. ఇప్పటికీ.. పరిస్థితులు మారాయి. అప్పుడు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడున్నంత బలంగా లెవ్వు. ప్రస్తుతం బీజేపీ తన సత్తా ఎంటో చూపుతోంది. కాంగ్రెస్ ను కూడా రేవంత్ గాడిన పెడుతున్నారు. ఈ క్రమంలో ముందుస్తు వ్యూహం ఏమాత్రం పనిచేస్తుందో చూడాలి మరీ…??