తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ముగిసిపోయినట్టుగానే కనిపిస్తోంది. అసైన్డ్ భూముల అక్రమాలు.. దేవరయాంజల్ భూముల్లో అవినీతి.. అక్రమార్కులందరినీ జైలుకు పంపిస్తాం.. అన్నట్టుగా హడావిడిచేసిన ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. దీనికి కారణమేంటీ? అన్నది ప్రశ్న. రేవంత్ కు పీసీసీ, షర్మిల పార్టీ హడావిడిలో ఈ విషయం పెద్దగా చర్చలోకి రాకపోయినప్పటికీ.. శేష ప్రశ్న మాత్రం మిగిలేఉంది. ఈటలపై ఇతర మంత్రులు, నేతలతో మాటల దాడిచేయించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంది? అన్నప్పుడు కేంద్రం నుంచి ఉన్న ఇబ్బందే కారణమని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణలో అనువుగా ఉన్న రాజకీయ వాతావరణనాన్ని సరిగ్గా వినియోగించుకొని, కమలం పువ్వులు పండించాలని చూస్తోంది బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈటల బీజేపీలో చేరిపోయాడు. కేసీఆర్ తో దాదాపు 20 ఏళ్లు కలిసి పనిచేసిన నేత.. బీజేపీలో చేరిపోవడం ఖచ్చితంగా ఆ పార్టీకి బలమే. మరి, అలాంటి నేతపై టీఆర్ఎస్ కేసుల పేరుతో దాడిచేస్తుంటే.. చూస్తూ ఊరుకోదు కదా? అందుకే.. బీజేపీ సైతం ఇదే పద్ధతిలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టిందని అంటున్నారు.
ఈ మధ్య ఖమ్మం గులాబీ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుపై ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఉరుములేని పిడుగులా వచ్చిపడిన ఈ దాడులతో టీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. దీంతో.. కారణాలు ఏంటని ఆరాతీస్తే.. ఇది పరోక్ష హెచ్చరికలేనని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. ఈటల విషయంలో దూకుడు కొనసాగితే.. ప్రతిగా జరగబోయేది ఇదేనని బీజేపీ తెలియజేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. అనివార్యంగా ఈటల విషయంలో గులాబీ నేతలు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.
దీంతో.. ఉప ఎన్నిక జరిగితే.. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు ఉంటాయే తప్ప, చట్ట ప్రకారం ఈటలపై ఎలాంటి దాడులూ ఉండే అవకాశం లేదని అంటున్నారు. విపక్షాల మధ్య ఓట్లను చీల్చడం.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపే గులాబీ దళం దృష్టిసారించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈటల అక్రమాలపై చర్యలు అంటూ గులాబీ నేతలు చేసిన హడావిడి.. మీడియాలో చర్చకు మాత్రమే పరిమితమైందని, ఈ కోణంలో చూసుకున్నప్పుడు ఈటల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయమేనని అంటున్నారు.