I Pac Survey- KCR: దేశంలో గుణాత్మక మార్పు రావాలంటాడు.. ఢిల్లీలో చక్రాలు తిప్పుతా అంటాడు. హస్తినలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. కానీ అదే సమయంలో సొంత రాష్ట్రంలో మాత్రం తనను మించి ఇంకొక పార్టీ ఎదగకూడదు అనుకుంటాడు.. అందుకే ప్రతిపక్ష పార్టీలు నియమించుకొనే వ్యూహకర్తల ఆఫీసులపై దాడులు చేయిస్తూ ఉంటాడు. ఓవైపు ప్రధానమంత్రి పీఠం అధిష్టించాలని కోరిక ఉన్న కేసీఆర్.. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఈ దాడుల వెనుక భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్పే సమాధానం ఏంటంటే.. వారు కేసీఆర్, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారట.. మరి ఉదయం లేస్తే భారత రాష్ట్ర సమితి నాయకులు చేసేది కూడా అదే కదా. ఒకవేళ ఇదే ప్రశ్న కనుక వారికి ఎదురైతే ఊరుకోరు. పైగా ఉల్టా కేసులు పెట్టి దబాయిస్తారు.

-కాంగ్రెస్ పై వ్యూహాత్మక దాడి
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనగొలు బృందం వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ బృందం సభ్యులు సర్వే చేస్తున్నారు. ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థుల బలాబలాలు కూడా క్రోడీకరిస్తున్నారు. అయితే ఈ బృందం ఇటీవల కాలం నుంచి క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్నది. ఇది ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియడంతో.. పోలీసులను ఉసిగొలిసింది. ఆగమేఘాల మీద సునీల్ బృందం పని చేస్తున్న కార్యాలయం పై పోలీసులు దాడి చేశారు.. విలువైన కంప్యూటర్లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బృందంలో పనిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు..
-పీకే టీం మాత్రమే ఉండాలా?
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రశాంత్ కిషోర్ టీం అయిన ఐ ప్యాక్ పనిచేసింది. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక కేసీఆర్ కు నచ్చకపోవడంతో పక్కన పెట్టారు.. భారత రాష్ట్ర సమితి పేరుతో ఇప్పుడు జాతీయ పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో మళ్లీ ప్రశాంత్ కిషోర్ కు కెసిఆర్ కబురు పంపారు.. ప్రస్తుతం ఆ బృందం భారత రాష్ట్ర సమితి కోసం పనిచేస్తోంది. ఇదే సమయంలో షర్మిలకు కూడా పనిచేస్తోంది.. ఆ సంస్థ లోటస్ పాండ్ కేంద్రంగా పని చేస్తోంది. తెలంగాణ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల దూకుడు గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో పలుచోట్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పై అనుచిత పోస్టులు పెడుతున్నారు. కానీ కేసీఆర్ మొన్న నర్సంపేట, ప్రగతి భవన్ ఘటనల మినహా ఆమె జోలికి పోలేదు. దీని పై కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.

–‘నమో అగైన్’ పై కన్ను
నమో అగైన్ అనే సంస్థ బీజేపీకి పని చేస్తోంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఐటీ సెల్స్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా నమో అగైన్ విస్తృతంగా పని చేస్తున్నది. ఇది మొత్తం బీజేపీ అధిష్టానం కనుసన్నల్లో సాగుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయడం, ఎవరికి టికెట్స్ ఇవ్వాలి? రాష్ట్రం చేస్తున్న తప్పులు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ విషయాల పై క్షేత్ర స్థాయిలో బలంగా పని చేస్తున్నది. అయితే దీని పై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారని, రేపో మాపో ఆ సంస్థ పై కూడా దాడులు చేస్తారని తెలుస్తున్నది..