
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీదే విజయం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఇప్పటివరకు తిరుగులేదని చెప్పొచ్చు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఇటీవల హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా గెలువలేదు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకొని ఉప ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించింది.
Also Read: రైతులకు కేసీఆర్ శుభవార్త.. రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
తాజాగా మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తోంది. దుబ్బాక సీటు టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపు ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అక్కడి ప్రజల్లో మాత్రం రామలింగారెడ్డి కుటుంబం.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
దుబ్బాకలో త్రిముఖ పోటీ తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య హోరాహోరా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పోటీలో కాంగ్రెస్ కొంత వెనుకబడగా టీఆర్ఎస్-బీజేపీ మాత్రం నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. దుబ్బాకలో ఎవరిదీ గెలుపు అనేది సర్వేలు కూడా చెప్పలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికపై సంచలన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మేడ్చల్లో గురువారం ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దుబ్బాక ఉపఎన్నికపై సంచలన కామెంట్స్ చేశారు. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని.. గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉందని చెప్పారు. అసలు దుబ్బాక ఎన్నికలు తమకు లెక్కే కాదని.. భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. ఇప్పటికే గెలుపు ఖాయమైందని.. అప్పటి వరకూ చిల్లర తతంగాలు మామూలేనని వాటిని మేం పట్టించుకోం అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఏం చెప్పారంటే..?
దుబ్బాకలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నోట్ల కట్టలతో పోలీసులు.. బీజేపీ నేతలు పట్టుబడటం ఇటీవల సంచలనం సృష్టించింది. పోలీసులే బీజేపీ నేతల ఇంట్లో డబ్బులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. తమకు సమాచారం అందడంతోనే నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందా? లేక టీఆర్ఎస్ ను ఓడించి ఇతర పార్టీలు చరిత్ర తిరగరాస్తాయా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!