
KCR: కుటుంబ పాలన దేశానికి అత్యంత ప్రమాదమని ప్రధాని నరేంద్రమోదీ మొదటి నుంచి చెప్పే మాట. 2014 నుంచి దీనిపై మోదీ ఓ యుద్ధమే చేస్తున్నారు. ఇప్పటికి ప్రజలకు విషయం అర్థమవుతోంది. మోదీ ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు. కుటుంబ పాలనతో జరిగే నష్టాలు తెలుసుకుంటున్నారు. అయితే కుటుంబ పాలన సంస్కృతి జాతీయ పార్టీల్లో కంటే, ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ. డీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్, ఎస్పీ, టీడీపీతోపాటు బీఆర్‌ఎస్ కూడా కుటుంబ పాలనకు అతీతం కాదు. కుటుంబ పాలనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుండడం, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఆయన బీఆర్‌ఎస్‌లో కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టుందన్న కారణంగా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న చాలామంది సీనియర్లకు తాజా నిర్ణయంతో కేసీఆర్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఒకరికి చాన్స్ ఇస్తే.. అందరూ అదేబాట..
ఫ్యామిలీ ప్యాకేజీ కోసం అగ్రకులాలకు చెందిన సీనియర్ నేతలు ఎక్కవ ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. ఒకరికి చాన్స్ ఇస్తే మిగతా వారు కూడా అదే బాటలో నడుస్తారన్న భావనతో ఫ్యామిలీ ప్యాకేజీ ఎత్తేయాలని గులాబీ బాస్ నిర్ణయించారట. ఏ కుటుంబానికి కూడా రెండు టికెట్లు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించారట. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా సర్వేల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఉండబోతోందని ఇప్పటికే హింగ్ ఇచ్చేశారట. పార్లమెటు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపే చాలామంది సీనియర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో తమ కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారట.

కీలక ఎన్నికల్లో తప్పటడుగు వేయకుండా..
రాబోయే ఎన్నికలు వ్యక్తిగతంగా కేసీఆర్‌కు, పార్టీ పరంగా బీఆర్‌ఎస్‌కు ఎంతో కీలకం. టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్తగా చేయాలి. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఇప్పటికే సర్వేల్లో బయటపడింది. ప్రస్తుత ఎమ్మెల్యేలలో సీనియర్లు కొడుకులు, కూతుర్లు, అల్లుళ్లకు రెండో టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్‌కు కూడా టికెట్ ఇవ్వాలని అడిగారట. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యుటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మాజీమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి లాంటి చాలామంది సీనియర్లు రెండు టికెట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రెండు టికెట్లు కాదు అసలు చాలామంది సీనియర్లకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా అనేదే డౌటుగా ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్న మాట. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా సర్వే రిపోర్టుల్లో మంచి ఫీడ్ బ్యాక్ వస్తేనే అనేది కీలక పాయింట్‌గా పెట్టుకున్నారు కేసీఆర్. కుటుంబ రాజకీయాలకు చెక్ అంటున్న కేసీఆర్.. తన కుటుంబంలోని వారికి ఈ నిబంధన వర్తింపజేస్తారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో బీఆర్‌ఎస్‌లో చివరకు టికెట్ల పంచాయితీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.