Telangana Election Results 2023: తెలంగాణ అంటే కెసిఆర్.. కెసిఆర్ అంటే తెలంగాణ అన్న రీతిలో పెనవేసుకుపోయింది బంధం. కానీ ఆ బంధాన్ని తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. మీ పాలన నచ్చలేదని తెగేసి చెప్పారు. ఇక చాలు దొర అంటూ సెలవు అని ముఖం మీద చెప్పేశారు. నన్ను కాదని ఎవరిని ఎన్నుకుంటారులే అన్న కెసిఆర్ అహంకారం పై తెలంగాణ ప్రజలు దారుణంగా దెబ్బ కొట్టారు. ఈ ఓటమిని కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. బయట ప్రపంచానికి ముఖం చూపెట్టలేక పోవడం బాధాకరం. అయినా ప్రజాస్వామ్యంలో ఇవి సర్వసాధారణం.
తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తాను అందించకుండా.. తన ఓఎస్డితో పంపించారు. గవర్నర్ తమిళసైకి అందించారు. చివరకు ప్రగతి భవన్ లో తన కాన్వాయ్ ని విడిచిపెట్టి.. ప్రైవేటు వాహనంలో ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయాలు సాధించారు. ముఖ్యమంత్రిగా 9 ఏళ్ల పాటు ఉన్నారు. అటువంటి నాయకుడు అవమానకరంగా నిష్క్రమించడం విచారకరం. అయితే ఇదంతా ఆయన స్వయంకృతాపం.
గత రెండు ఎన్నికల్లో తన మాటల గారడీతో తెలంగాణలో గెలుపొంద గలిగారు. ఈసారి మాత్రం ప్రజలు అందుకు అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని కెసిఆర్ పేరు బంధాన్ని తెంచుకోగా… కెసిఆర్ పదవి బంధాన్ని ఇప్పుడు ప్రజలు తెంచేసారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేని తెలంగాణ ఉంటుందని ఆయన అభిమానించేవారు ఊహించి ఉండరు. మొత్తానికైతే ప్రగతి భవన్ నుంచి అవమానకరంగా నిష్క్రమించడం కెసిఆర్ కు ఒక గుణపాఠమే.