KCR Praises On Bhatti Vikramarka: ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కను ప్రశంసిస్తూ మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది. దీంతో భట్టిని కూడా తమ పార్టీలో కలుపుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం భట్టిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు బాగుందని చెప్పారు. పైగా ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన పార్లమెంట్ కు వెళితే బాగుంటుందని చెప్పడంతో భట్టి ముసిముసి నవ్వారు. దీంతో ఇక భట్టిని కూడా టీఆర్ఎస్ లో చేర్చుకుంటారనే వాదనలు సైతం వస్తున్నాయి.
గతంలో పువ్వాడ అజయ్ కుమార్ విషయంలో కూడా కేసీఆర్ ఇలాగే ప్రవర్తించి చివరకు ఆయనను పార్టీలోకి లాగేశారు. ఇప్పుడు భట్టి వంతు వచ్చిందని అందరు చర్చించుకుంటున్నారు. పైగా ఆయన ఇటీవల ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వారికి అనుకూలంగా మాట్లాడటంతో అందరిలో ఆసక్తి కలుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భట్టి కూడా పడిపోయారనే కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక సీనిర్లందరు వ్యతిరేకించారు. అందులో భట్టి కూడా ఒకరు కావడం గమనార్హం. దీంతో భట్టి కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా టీఆర్ఎస్ కోసమే పని చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో భవిష్యత్ లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే సంకేతాలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో భట్టి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు కూడా హెచ్చరికలు చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు.
ఇప్పటికే దళితబంధు పథకం అంతా బూటకమని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా భట్టి మాత్రం ఆ సమావేశాలకు హాజరవుతూ తమ మండలంలో కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ విధానాలను పాటించకుండా సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళుతున్నారు .దీంతో ఆయన టీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారనే ఊహాగానాలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్ లో భట్టి తప్పకుండా టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం