అకస్మాత్తుగా కుమార్తె కవితను శాసన మండలి ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులను సూచిస్తున్నది. కుమారుడు కె టి రామారావుకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి, తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలని చూస్తున్న కేసీఆర్ అందుకు సమయం ఆసన్నమైనది భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.
గత సంవత్సరం లోక్ సభ ఎన్నికలలో నిజామాబాదు నుండి ఓటమి చెందిన తర్వాత కవిత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందరు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానం చేశారు. కానీ అనూహ్యంగా ఆమెను రాజ్యసభకు పంపకుండా, శాసన మండలికి పంపడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. నిజామాబాదు జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆమె బుధవారమే నామినేషన్ దాఖలు చేశారు.
అంతకు ముందు పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించడం కూడా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా కనిపిస్తున్నది. కేటిర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, మంత్రివర్గంలో ఆయనకు అండగా ఉండటం కోసం కవితను ఇక్కడకు తీసుకు వస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త మంత్రివర్గంలో ఆమెకు ప్రస్తుతం కేసీఆర్ నిర్వహిస్తున్న శాఖలు కేటాయించే అవకాశం ఉంది.
ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కేటీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సాధింపలేక పోతున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా మేనల్లుడు టి హరీష్ రావు మౌనంగా ఉండడం మిగుడు పడటం లేదు. అందుకనే కేటీఆర్ కు ప్రభుత్వంలో కవిత అండగా ఉండాలని భావిస్తున్నట్లు కనపడుతున్నది.
గత లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితో, అధికారంలోకి వచ్చే కూటమితో చేరి ఉప ప్రధాని కావాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారు. అయితే నరేంద్ర మోదీ తిరిగి మంచి ఆధిక్యతతో, సొంత బలంపై అధికారంలోకి రావడంతో అంచనాలు తలకిందులయ్యాయి. దానితో రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతూ వచ్చారు.
కానీ, ఈ మధ్య వరుసగా మోదీ ప్రభుత్వం చేబడుతున్న పలు చర్యలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురవుతూ ఉండటం, ఆర్ధిక రంగంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతూ ఉండడం, ఒకొక్క రాష్ట్రంలో బిజెపి ఓటమి చెందుతూ రావడంతో తిరిగి కేసీఆర్ లో ఆశలు చెలరేగాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ మరింతగా చతికలబడుతూ రావడం, ప్రతిపక్షాలకు కేంద్ర బిందువు అంటూ ఏ నాయకుడు లేకపోవడంతో జాతీయ రాజకీయాలకు ఇదే సమయం అని కేసీఆర్ నిర్ధారణకు వచ్చిన్నట్లు భావిస్తున్నారు.
త్వరలోనే బిజెపియేతర,కాంగ్రెస్సేతర పార్టీల సదస్సు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి అంశాలతో మోదీ ప్రభుత్వంపై మూకుమ్మడి పోరుకు నేతృత్వం వహించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.