Kcr New Political Party:కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో కొత్త పార్టబెట్టబోతున్నాడా..? జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కొత్త పార్టీ అవసరమని భావిస్తున్నారు..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ రావొచ్చు’ అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దానికి టైం, సందర్భం ముందు ముందు చెబుతానని కేసీఆర్ అన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ తాజాగా కొత్త పార్టీ పెడుతాననడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
కేసీఆర్ ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నా.. దానిపై కూడా వివరణ ఇచ్చారు. అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారని అన్నారు. ఈ రాజ్యంగంతో దళితులకు న్యాయం జరగడం లేదని వివరణ ఇచ్చారు. అందువల్ల రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని మరోసారి కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నందున దీనిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పలు రంగాలపై మోదీ నియంత్రుత్వ పోకడలు అవలంభిస్తున్నారని, దీనిపై పోరాటం చేస్తామన్నారు.
రైతుల వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టాలని చూస్తోందని, ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యుత్ నిపుణుల పేరిట సబ్సిడీలు నిలిపివేయాలని బడుగు వర్గాలకు ఉచిత విద్యుత్ రద్దు చేసి, దొంగలకు సద్ది కట్టాలన్నదే కేంద్రం అనుసరిస్తోందని విమర్శించారు. దేశంలోని బ్యాంకులను లూటీ చేసిన దొంగలను బార్డర్ దాటించారని ఆరోపించారు. ఇక ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని తలకిందులు అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని, ప్రజా ప్రభంజనమైనప్పుడు ప్రభుత్వాలు దిగిపోవాల్సి వస్తుందని అన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త పార్టీ పెడుతాననడం చర్చనీయాంశంగామారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ ను ఉపయోగించుకోవచ్చని రాజకీయంగా చర్చ సాగుతోంది. దేశంలో తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిశోర్ బృందం సర్వే నిర్వహిస్తోందని, అటు టీఆర్ఎస్ కూడా విడివిడిగా సర్వేలు చేస్తోందని కేసీఆర్ అన్నారు. ధర్మం పేరిట బీజేపీ అంతర్యూద్దాలు ప్రోత్సహిస్తోందని అంటూ బీజేపీ హఠావో.. దేశ్ బచావో.. అంటూ నినాదమిచ్చారు.