Chandrababu- KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడి బాటలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పయనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు మొదట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఎన్నికలకు ఏడాది ముందు.. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. మోదీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో బైబై మోదీ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలని, ఇందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌తో చేతులు కాలిపారు. కాని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పరాభవమే ఎదురైంది. మోదీ సారథ్యంలోని బీజేపీ వరుసగా రెండోసారి అధిక ఎంపీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆయన బాటలో కేసీఆర్..
2001 వరకు టీడీపీలో ఉన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత సొంతంగా టీఆర్‌ఎస్ స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ తన రాజకీయ గురువు చంబ్రాబుతీరుగానే ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ 2014 నుంచి 2020 వరకు కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గతేడాది జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదురు కావడంతో కేంద్రంతో అప్పటి నుంచి ఢీ అంటే ఢీ అంటున్నారు.
Also Read: Janasena and BJP : జనసేన-బీజేపీ మధ్య కోల్డ్ వార్ నిజమా? అసలేం జరుగుతోంది?
ఫ్లెక్సీ రాజకీయాలు..
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతన్న వేళ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలాగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోకుండా నగరమంతా టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. తాజాగా బీజేపీ సమావేశాలు జరిగే చోట ‘చాలు మోడీ.. చంపకు మోడీ’ అని ఫ్లెక్సీ పెట్టించారు.

తండ్రిని మించిన తనయుడు..
ఇక కేసీర్ తనయుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అయితే బీజేపీ టార్గెట్‌గానే వారం రోజులుగా రాజకీయాలు చేస్తున్నారు. రోజుకు రెండుమూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీని తీవ్ర పదజాలంలో విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీ రాజకీయాలకు సూత్రధారి కేటీఆరే అని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. తాజాగా పత్రికల మొదటి పేజీల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో కనిపించకుండా ప్రకటనలు ఇప్పించారు. మరోవైపు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వెల్‌కం మోదీ అంటూనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అభివృద్ధి చూడండి.. నేర్చుకోండి.. మీరు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయండి అంటూ అందులో పేర్కొన్నారు. మీ పాలన అంతా విద్వేషమే.. మా పాలన అంతా అభివృద్ధి అని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు రాష్ట్రంలో ఉండే ప్రధాని మోదీ టీఆర్‌ఎస్ సర్కార్ చేస్తున్న విమర్శలు, ఫ్లెక్సీల రాజకీయాలపై ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also Read:TRS vs BJP: బీజేపీతో కేసీఆర్ పోటీ కార్యక్రమాలు.. హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నారు!