తెలంగాణలో టిఆర్ఎస్ ఎంతటి పవర్ ఫుల్ పార్టీ అన్నది తెలిసిందే. అడపాదడపా ఆటుపోట్లు తప్పించి…. మొత్తం రాష్ట్రమంతా ఎన్నికలు ఏకగ్రీవమే అన్న భావన అందరిలో స్థిరపడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. టీఆరెస్ ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలన్నింటినీ విజయవంతంగా నిర్వీర్యం చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ చూపించిన పోరాటపటిమ, తీసుకున్న స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు కేసీఆర్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే…. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఉప ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయి. ఇదే సమయంలో అందరూ ఈసారి కూడా టిఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని.. అసలు కాంగ్రెస్ కనీసం ఉప ఎన్నికలను తమ భవిష్యత్తు కార్యాచరణలో ఒకటిగా పరిగణిస్తుందా లేదా అన్నది కూడా అనుమానమే అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ వెనుకబడిందని ఎంతో మంది అంటున్నారు కానీ తమ అసలు సత్తా ఏమిటో దుబ్బాక ఉప ఎన్నికల్లో చూపిస్తామని అంటున్నారు.
అలాగే మరొక పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…. టిఆర్ఎస్ పార్టీని వారు సోలిపేట కుటుంబసభ్యుల్లో ఎవరైనా నిలబెట్టుకోండని అని సవాల్ విసిరారు. అతనే దగ్గర ఉండి ఎన్నికలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలిచేలా చేస్తానని అన్నారు. అతను అలా మాట్లాడిన కొద్ది రోజులకే ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. దీంతో ఈ మధ్యకాలంలో ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితం అయిన కేసీఆర్…. క్షేత్ర స్థాయి రాజకీయం మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రజల్లో నెమ్మదిగా వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని.. కాంగ్రెస్ విసిరిన సవాలు కేసీఆర్ గుండెల్లో గుబులు రేపుతోందని అధికార పార్టీ వర్గాల సమాచారం. మరి కెసిఆర్…. కాంగ్రెస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ఎలాంటి బదులిస్తాడో వేచి చూడాలి.