
KCR meets Modi: ప్రధాని మోడీని (PM Modi) కలిసింది ప్రధానంగా సమస్యలపైనే అయినా యాదాద్రి ప్రారంభోత్సవానికే కేసీఆర్ (CM KCR) ప్రాధాన్యమిచ్చారని.. ఇదో ఆద్యాత్మిక పిలుపేనని అర్థమవుతోంది. భక్తి విశ్వాసాలు బలంగా ఉన్న మోడీ, కేసీఆర్ లు ఇలా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం ఏర్పాట్లలో పాల్గొనేందుకు ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సందర్భంలో దాని ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా ఆధ్యాత్మిక వాదులే కావడంతో ఇద్దరిలో భక్తి కూడా ఎక్కువే. యాగాలు చేయడంలో కూడా ఇద్దరూ దిట్టలే. దీంతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానిని తప్పకుండా రావాల్సిందిగా కోరారు. ప్రధానికి కూడా దైవభక్తి ఎక్కువ కావడంతో ఆయన కూడా వచ్చేందుకు సమ్మతించినట్లు సమచారం.
ప్రధాని మోడీ కేసీఆర్ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. హైదరాబాద్ – నాగపూర్, హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక నడవాలు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ ను ప్రధాన ఐటీ రంగంగా మార్చాలని సూచించారు. వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జిల్లాలు పెరిగినందున జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని కోరారు. తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సహకరించాలన్నారు.
తెలంగాణకు ఐఐఎం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దేశంలో పలు స్టేట్లలో ఐఐఎంలు ఏర్పాటు చేసినా హైదరాబాద్ కుమాత్రం కేటాయించలేదు. దీంతో మాకు కూడా కావాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రహదారుల కోసం గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణకు 4 వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని కోరారు. 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు సహకరించాలని సూచించారు.
దళితులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకం తీసుకొచ్చామని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానికి చెప్పారు. దళితబంధు ద్వారా రూ.10 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనిపై ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. ఇదే సందర్భంలో తెలంగాణలో ఐపీఎస్ కేడర్ పోస్టులు పెంచాలని కోరారు. జిల్లాలు పెరిగినందున కేడర్ పోస్టులను 139 నుంచి 194కు పెంచాలని సూచించారు.
దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంశాలపై చర్చించారు. కీలక విషయాల్లో సహకారం అందించాల్సిందిగా కోరారు. దీంతో పలు సమస్యలపై సహృద్భావం కలిగింది. రాష్ర్ట అభివృద్ధిలో కేంద్రం సహకారం అందించాల్సిందిగా కోరారు. తెలంగాణలో జరుగుతున్న పనులకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.