CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రనేతలు ప్రచార సభలు నిర్వహిస్తుండగా, అభ్యర్థులు తమ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన ప్రచార సందడే కనిపిస్తోంది. ఇక పార్టీల విషయానికి వస్తే.. అధికార బీఆర్‌ఎస్ ప్రచారంలో మిగతా పార్టీల కంటే ముందుంది. దాదాపు 20 రోజులుగా గులాబీ బాస్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే రొటీన్ ప్రసంగం ఓటర్లను ఆకర్షించడం లేదు. బీఆర్‌ఎస్ నేతలు కూడా చప్పగా సాగుతున్న ప్రచారంతో నీరసించిపోతున్నారు. అధినేత వస్తే నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయనంకుంటే… ఉన్న ఓట్లు పోయే పరిస్థితి వచ్చేలా ఉందని బయటకు చెప్పలేక మదన పడుతున్నారు.
సందడి లేని సభలతో అసహనం..
ఇక కేసీఆర్ ఇప్పటి వరకు దాదాపు 50 ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. రెండు విడతల ప్రచారం పూర్తి చేసుకుని చివరిదైన మూడో విడత ప్రచారం మొదలు పెట్టారు. కానీ, మొదటి విడత నుంచి ప్రస్తుతం జరుగుతున్న సభల వరకు ఎక్కడా కొత్తదనం కనిపిచండంలేదు. కేసీఆర్ స్పీచ్‌లో వాడి, వేడి, పదును తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలోచించండి, అభ్యర్థులను కాదు పార్టీలను చూడండి.. ఉచిత విద్యుత్ ఇస్తున్న, రైతు బంధు ఇస్తున్న, ధరణి తీసేస్తరట, ఆలోచించాలి.. చర్చకు పెట్టాలి.. అంటూ ప్రచారం సాగిస్తున్నారు. దీంతో మొదటి విడత ఏడు సభలకు జనం కాస్త ఎక్కువగానే వచ్చారు. రెండు విడత కూడా పర్వాలేదు అన్నటుగా సభా ప్రాంగణాల్లో సందడి కనిపించింది. మూడో విడత ప్రచారం నాటికి అన్ని పార్టీలో ప్రచారం ఊపందుకోవడం, కేసీఆర్ ప్రచారం రొటీన్‌గా, చప్పగా సాగుతుండడంతో బీఆర్‌ఎస్ సభలకు జనం రావడం లేదు. దీంతో గులాబీ బాస్‌లో అసహనం పెరుగుతోంది.
సభికులపై తిట్ట దండకం..
వెలవెల బోతున్న సభలను చూసి కేసీఆర్ అసహనానికి గురవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే సభకు వచ్చి సందడి చేసేవారిపై కేసీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మంగళవారం నల్లగొండ, మహబూబాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సభల్లో కేసీఆర్ సహనం కోల్పోయారు. సభలో ఈలలు వేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ సభలో అయితే.. ఈలలు వేస్తున్న యువకులపై హైలాగా.. తలకాయ లేదా.. వాన్ని పట్టుకోండి.. అంటూ హుకూం జారీ చేశారు.
గతంలో పంచులు, చురకలు, పిట్ట కథలు..
కేసీఆర్ సభలు అంటే గతంలో భారీగా జనం వచ్చేవారు. ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఆయన మాట్లాడే మాటలకు వేసే పంచులకు, విపక్షాలకు అంటించే చురకలకు, సభలో చెప్పే పిట్ట కథలకు ఆకర్షితులయ్యేవారు. కానీ ఇప్పుడు ఇవేవీ కేసీఆర్ మాటల్లో కనిపించడం లేదు. రొటీన్ ప్రసంగం సాగుతోంది. పదాలు, వాఖ్యాలు అటూ ఇటుగా.. ఇప్పటి వరకు నిర్వహించిన 50 సభల్లో మూసధోరణి ప్రసంగమే సాగుతోంది. దీంతో కేసీఆర్ సభలకు రావడానికి జనం ఆసక్తి చూపడం లేదు. బీఆర్‌ఎస్ నేతలు డబ్బులు ఇచ్చినా సభలకు రావడానికి వెనుకాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది. రేవంత్ సభలు సక్సెస్ అవుతున్నాయి. దీంతో అసహనం పెరిగిన కేసీఆర్ ఇలా ప్రజలను ధూషిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.