
KCR: సీఎం కేసీఆర్.. ఈ పేరు తెలంగాణలో ఒక బ్రాండ్. తెలంగాణ సాధించి తీసుకొచ్చిన నాయకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ దురందరులకే అంతు చిక్కని మనిషి. ఆయన ప్లాన్స్, ప్లానింగ్స్, గోల్స్ ఎవరికీ అంత తొందరగా అర్థం కావు. అదే లక్షణాలే ఆయనను మిగితా నాయకులతో ప్రత్యేకంగా నిలిపింది. ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ఎవరికీ లొంగకుండా విజయవంతంగా ఏడేళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు. 20 ఏళ్లుగా టీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడిన అందులో ఒక నిగూఢ అర్థం ఉంటుంది. అయితే సోమవారం జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను ఆలోచింప చేస్తున్నాయి.
ఏపీలో అభిమానుల పిలుపు వెనుక మతలబు ఏంటి ?
సోమవారం హైదరాబాద్ లో టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం, రాజకీయంగా ఎదురైన ఒడిదొడుగులను సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం, ఏర్పాటు, స్వరాష్ట్రంలో ఎదురైన కష్టాలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు వంటివన్నీ వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, టీఆర్ఎస్ చేస్తున్న పాలన చూసి మాహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ కు చెందిన కొన్ని జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని చెప్పారు. ఏపీలో ఉన్న అభిమానులు కూడా పిలుస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేస్తే అన్నీ తామే చూసుకుంటామని వారు చెప్పారని సీఎం తెలిపారు. ప్లీనరీలో ఈ వ్యాఖ్యలు మామూలుగా చేయలదని, దీని వెనక సీఎం మాస్టర్ ప్లాన్‌తో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలియజేస్తున్నారు.
జగన్ కోసమేనా ?
ఏపీలో రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే అది ఎవరికి మేలు చేస్తుందన్న విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఏపీ సీఎం జగన్‌కు ఇబ్బంది పెట్టేలా మాత్రం కేసీఆర్‌కు చర్యలు ఉండకపోవచ్చు. కేసీఆర్, జగన్ మొదటి నుంచి స్నేహంగానే ఉంటున్నారు. జగన్ ఘన విజయం సాధించాక సీఎం కేసీఆర్ ఆయనను ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. అలాగే జగన్ ప్రమాణస్వీకారానికి కూడా కేసీఆర్ వెళ్లారు. చంద్రబాబు నాయుడిపై కోపంతో జగన్ గెలుపు కోసం కేసీఆర్ ప్రయత్నించారని ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి. అందులో నిజం లేకపోలేదు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో అనవసరంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు తలదూర్చడం, సీఎం కేసీఆర్‌కు కోపం తెప్పించదని, అందుకే ఆయన జగన్ కు సహకరించారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లోకి కేసీఆర్ ఎంట్రీ అయితే అది జగన్ కు మేలు చేసేందుకేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబును ఓడించేందుకేనని అంటున్నారు. జగన్ గెలుపుకోసం కేసీఆర్ ఏపీలోకి వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా లేదా అన్న విషయంలో కాలమే సమాధానం చెబుతుంది.