
ఈ నెలాఖరుతో ముగియనున్న లాక్‌డౌన్ పొడిగుంపుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సందిగ్థతలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనబడుతున్నా టెస్టులు ఎక్కువగా జరపగా పోవడమే కారణమని స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రీతి సుడాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వ్రాయడం గమనార్హం.
మరోవంక ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు జరుపవద్దని ప్రభుత్వం నిషేధించినా వారంతా బహిరంగంగానే జరుపుతున్నారని, ప్రభుత్వం సహితం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నదని తెలుస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులలో సహితం కరోనా చికిత్సలు చేస్తున్నారు. ఆ విధంగా వేలకొలది పరీక్షలు ప్రైవేట్ గా జరుగుతూ ఉండడంతో అవన్నీ ప్రభుత్వ లెక్కలలోకి రావడం లేదు.
ప్రభుత్వం సహితం కరోనా అనుమానాలపై మృతి చెందిన వారికి పరీక్షలు జరపడం లేదు వారిని కరోనా మృతులలో చేర్చడం లేదు. అందుచేత వైరస్ కట్టడిలో ఉన్నట్లు పైకి చెబుతున్నా రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
కరోనా, వానకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సరి, బేసి విధానంలో దుకాణాలను తెరుస్తున్నారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని కొనసాగించాలా? మార్పులు చేయాలా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే చాలావరకు సడలింపులు ఇచ్చారు. అవసరమైతే మరికొన్ని సడలింపులు ఇచ్చి లాక్‌డౌన్ ను మరికొంతకాలం పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ లకు సడలింపులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ సంకేతం ఇచ్చారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లును తెరిచే విషయం పరిశీలింపవలసి ఉంది. ఇప్పటికే రోడ్లపై ఎక్కువగా తిరుగుతున్నందున అవి లేకపోవడంతో చాల ఇబ్బంది పడుతున్నారు.