Srikantachari Mother Shankaramma: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయి నెలలు గడుస్తోంది. వాటి భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. గవర్నర్‌తో ఉన్న విభేదాలు, గతంలో పాడి కౌషిక్‌రెడ్డి విషయంలో గవర్నర్ తిరస్కరించడం వంటి పరిణామాలతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ విషయంలో కేసీఆర్ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఇద్దరిని ఎంపిక చేసింది. ఈమేరకు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కూడా తెలిపింది. ఇందులో ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్, మరొకరు ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారయణను ఎంపిక చేశారు.
ఆచితూచి ఎంపిక..
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వెనుకబడిన కులాల ఓట్లు కొల్లగొట్టేందుకు బీసీ, ఎస్టీ సామాజికవర్గాలకు టికెట్లు ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు మొదటి నుంచి మొండిచేయి చూపుతూ.. తెలంగాణ వ్యతిరేకులను అందలం ఎక్కించిన కేసీఆర్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎవంట ఉండి తర్వాత ఎమ్మెల్యీ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్, బీజేపీలో చేరి.. మునుగోడు ఎన్నికల సమయంలో తిరిగి గులాబీ గూటికి చేరాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న శ్రవణ్, ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎసరు పెట్టే ప్రయత్నాలు చేశాడు. దీంతో కేసీఆర్ పోలీ లేకుండా చేసేందుకు శ్రవణ్‌ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక 1999 నుంచి 2004 వరకు సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన కుర్ర సత్యనారాయణ ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత బీజేపీలో చేరారు. 2017లో బీఆర్‌ఎస్ గూటికి వచ్చారు. కార్మిక సంఘం నాయకుడిగా పటాన్‌చెరువు ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది.
శంకరమ్మకు మరో‘సారీ’..
ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మాహుతి చేసుకున్న తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మాత్రం కేసీఆర్ మొదటి నుంచి మొండిచేయి చూపుతున్నారు. ఉద్యమ సమయంలో శంకరమ్మ తల్లిని ఆదరించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమెను హైదరాబాద్‌కు పిలిపించుకుని సత్కరించారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది. కానీ యథావిధిగా ఊరించి ఉసూరుమనిపించారు గులాబీ బాస్. ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రవణ్ కూడా శంకరమ్మ సామాజికవర్గానికి చెందనవారే. ఈ నేపథ్యంలో శంకరమ్మ టికెట్‌ను శ్రవణ్ తన్నుకుపోయారు. అమరుడి తల్లికి మళ్లీ నిరాశే మిగిలింది.