రాజకీయం నిత్య వ్యూహం. వ్యూహం లేని రాజకీయం చతికిలబడుతుంది. అందుకే.. పార్టీ ఏదైనా, నేతలు ఎవరైనా ఎత్తులు, పై ఎత్తులతో పాలిట్రిక్స్ నడిపిస్తుంటారు. తెలంగాణ రాజకీయాలను చూసినప్పుడు.. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడానికి ముందు ఒకలా.. ఇప్పుడు మరోలా అనుకునే వాతావరణమైతే కనిపిస్తోంది. దీని తీవ్రత ఎంత? రేంత్ తనను ఏ మేరకు ప్రూవ్ చేసుకుంటాడు? అన్నది ఇప్పుడే తెలియదు. కానీ.. పొలిటికల్ వెదర్ మాత్రం ఛేంజ్ అయిపోయింది. రేవంత్ రాకతో కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చినట్టేనని కొందరు భావిస్తుండగా.. టీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలైనట్టేనని కూడా మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే.. మూడో కోణం కూడా ఇందులో దాగి ఉంది. రేవంత్ రాకతో కేసీఆర్ హ్యాపీగా ఉన్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
దుబ్బాక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీ సాధారణ పార్టీనే. కానీ.. ఆ ఉప ఎన్నిక గెలవడంతో.. ఆ పార్టీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి కారణం ఏమంటే.. రాష్ట్రంలో మరో పార్టీ బలంగా లేకపోవడం. కేసీఆర్ దెబ్బకు కుదేలైపోయిన కాంగ్రెస్.. తిరిగి కోలుకోలేని విధంగా పడిపోయింది. కొందరు టీఆర్ఎస్ లోకి జంప్ అయితే.. మిగిలినవారు తమలో తాము కీచులాడుకుంటూ.. పార్టీని పడుకోబెట్టేశారు. దీంతో.. టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి లేకుండా పోయాడు. ఈ గ్యాప్ ను చక్కగా ఉపయోగించుకుంది బీజేపీ. ఎవరూ లేని చోట ఉన్నవారే లెక్కలోకి వస్తారు కాబట్టి.. బీజేపీ లీడ్ లోకి వచ్చేసింది.
ఈ పరిస్థితిని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కేసీఆర్ పై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ దారుణమైన పదాలను వినియోగించారు. అయినప్పటికీ.. కేసీఆర్ స్పందించలేదు. కారణం ఏంటో తెలిసిందే. కౌంటర్ ఇచ్చారంటే.. విషయం జనాల్లో చర్చగా మారుతుంది. అప్పుడు బీజేపీని తమకు సమఉజ్జీ అని గులాబీ పార్టీ పరోక్షంగా ప్రకటించినట్టు అవుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. అంతేకాకుండా.. మత ఎజెండాను ముందుకు తీసుకెళ్లే బీజేపీతో.. పలు స్టాండ్స్ విషయంలో ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకే.. బీజేపీని లైట్ తీసుకుంటున్నట్టుగానే జనాలకు అర్థం చేయించే ప్రయత్నం చేశారు కేసీఆర్.
అయితే.. కాంగ్రెస్ తో ఇలాంటి ఇబ్బంది ఉండదు. సెక్యులర్ పార్టీగా ఉన్న కాంగ్రెస్.. మత రాజకీయాలను చేయదు. కాబట్టి.. హస్తం పార్టీతో తలపడడం తేలిక అవుతుంది. అందుకే.. తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటారు కేసీఆర్. కానీ.. ఆ పార్టీ చతికిలబడడంతో ఏమీ చేయలేకపోయారు. అయితే.. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతో.. కేసీఆర్ హ్యాపీగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. బీజేపీని పూర్తిగా సైడ్ చేసి కాంగ్రెస్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుందనే భావనలో గులాబీ దళం ఉందని అంటున్నారు. బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా.. కాంగ్రెస్ తో ఢీకొంటే సరిపోతుందని భావిస్తున్నారట. మరి, ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అన్నది చూడాలి.