KCR – Mahender Reddy : గిప్పుడు పదవి ఎందుకయ్యా.. ఆరిపోయే దీపాన్ని ఇలా వెలిగించేసిన కేసీఆర్

తన అనుచరులు తీసుకొస్తున్న ఒత్తిడికి మహేందర్‌రెడ్డి లేపనంగా ఈ మంత్రి పదవిని వాడుకుంటారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Written By: Bhaskar, Updated On : August 24, 2023 7:33 pm

Patnam-Mahender-Reddy-taking-oath-as-minister

Follow us on

KCR – Mahender Reddy : అవి రాయల వారు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులు. మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. వికటకవి తెనాలి రామకృష్ణ సహా దిగ్గజ కవులు మొత్తం ఆసీనులై ఉన్నారు. రాయల వారు సింహాసనంలో కూర్చున్నారు. ఇలోగా ఒక భటుడు చేతిలో మంత్రదండంతో సభలోకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయి అతన్నే చూడటం ప్రారంభించారు. ఈలోగా ఓ మంత్రి లేచి నువ్వు కేవలం భటుడివి నీకు మంత్రదండం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. దానికి ఆ సిపాయి ‘నాకు రాయలవారే ఇచ్చారు’ అంటూ తిరుగు సమాధానం చెప్పారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. రాయల వారి వైపు చూడటం ప్రారంభించారు. దానికి రాయలవారు ఒక కథ చెప్పారు.

ఇంతకీ ఏం జరిగిందంటే

రాయల వారి దర్బార్‌లో ఆ భటుడు పని చేస్తుండేవాడు. తన అనుచరులతో గొడవ పడుతుండేవాడు. పైగా నాకు గనుక మంత్రదండం లభిస్తే మిమ్మల్ని తుద ముట్టిస్తా అని బీరాలు పలికేవాడు. ఈ విషయం ఒకసారి రాయల వారి దృష్టికి వచ్చింది. చాలా రోజలు ఆలోచించి చివరికి ఆ భటుడికి మంత్రదండం ఇచ్చాడు. కానీ తోటి భటులను ఏమీ చేయలేకపోయాడు. చివరికి తనకు మంత్రదండం ఎందుకు ఇచ్చారో, దీని వల్ల ఏం ఉపయోగం ఉండదని తెలుసుకుని నేరుగా దర్బారుకు వచ్చాడు. తనను మన్నించమని రాయలవారి కాళ్ల మీద పడి వేడుకున్నాడు. ఇక రాయల వారి కాలం నుంచి నేటి చంద్రశేఖర్‌రావు జమానాకు వస్తే..

ఏం చేయగలరు?

గురువారం రాష్ట్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కానీ మరో మూడు నెలల్లో ముగిసిపోయే ప్రభుత్వంలో ఆయన ఏం చేస్తారనేది ఇక్కడ ప్రశ్న. తాండూరు టికెట్‌ పైలెట్‌ రోహిత్‌రెడ్డికి కేటాయించిన నేపథ్యంలో పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించేందుకే మంత్రి పదవి ఇచ్చారని తెలుస్తోంది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగటంతో కేసీఆర్‌ మంత్రి పదవి కట్టాబెట్టారు. పైన చెప్పిన రాయల వారి కథకు, ప్రస్తుతం మహేందర్‌రెడ్డి ఎపిసోడ్‌కు పెద్ద తేడా లేదు. కాకపోతే అక్కడ ఉన్నది భటుడు, ఈయన ఉద్దండ రాజకీయ నాయకుడు. ఈ మూడు నెలల మంత్రి పదవితో మహేందర్‌రెడ్డి ఏం చేస్తారు? ఏమైనా చేసే స్వేచ్ఛ కేసీఆర్‌ ఇస్తాడా? తన అనుచరులు తీసుకొస్తున్న ఒత్తిడికి మహేందర్‌రెడ్డి లేపనంగా ఈ మంత్రి పదవిని వాడుకుంటారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.