తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో విఫలమయినందుకు కేసీఆర్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఇప్పటివరకు రూ.లక్ష రైతు రుణమాఫీ అమలు కాలేదని, 40 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని ఉత్తమ్ ఆరోపించారు. పత్తి విత్తనాల సరఫరా, కొనుగోలు, ధర నిర్ణయించే అధికారం రాష్ట్రం చేతిలో లేదని, అలాంటప్పుడు పత్తి పంట వేయాలని ఎందుకు చెబుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. క్వింటాలుకు కనీసం రూ.7వేలు చెల్లించి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చిన తర్వాతే పత్తి పంట సాగుచేయాలని సూచించాలని కోరారు. మొక్కజొన్న రైతులపై ఆంక్షలు పెడితే సహించేది లేదని, రైతుకు నష్టం కలిగే విధంగా ఎలాంటి ప్రతిపాదన తెచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఊరుకునేది లేదని, తీవ్రంగా పోరాడి ప్రతిఘటిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
నియంత్రిత పంటల సాగు విధానం లోపభూయిష్టంగా ఉందని, దాని అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కోరింది. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం అయ్యారు.
సమావేశం అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు చెందిన అంశాలను నిర్ధారణ చేసేటప్పుడు సమగ్రంగా సంప్రదింపులు జరపాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు. తాము చెప్పిన పంటలు వేయకపోతే ‘రైతు బంధు’ఇవ్వబోమని కేసీఆర్ చెప్పడం దారుణమని, రైతులను బెదిరించడం సరికాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అయినా, నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు రైతులు సిద్ధపడుతుంటే ఇప్పుడు తాము చెప్పిన పంటలే వేయాలని సీఎం షరతు విధించడం తుగ్లక్ చర్య అని ఉత్తమ్ అన్నారు.