KCR- Jagan: తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ రాజకీయంగా సహకరించుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడమన్న సంకేతాలిస్తూనే వ్యక్తిగతంగా కలిసి నడుస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఈ పరంపర కొనసాగుతోంది. అయితే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించగా.. జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నారు. అయితే తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా బీజేపీ పై సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో కూడా బలోపేతం కావాలని ప్రయత్నాలు ప్రారంభించిందో అప్పుడే తన స్ట్రాటజీని మార్చారు. బీజేపీ పెద్దలను క్రమేపీ దూరమై…టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నుంచి ఎదురవుతున్న ప్రతికూలతలను పసిగట్టి పోరాట పంథాను అలవరచుకున్నారు. అయితే జగన్ విషయంలో మార్పు ఎప్పుడన్నది తెలియడం లేదు. ఎందుకంటే ఆయన సీఎం కాక ముందు నుంచే బలమైన సీబీఐ, ఈడీ కేసులు ఉండడమే అందుకు కారణం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నాయకత్వం కోసం పట్టుబడిన జగన్ కు నాటి కాంగ్రెస్ నాయకత్వం నుంచి సహకారం కరువైంది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దాని ఫలితమే సీబీఐ, ఈడీ కేసులు. చివరకు జగన్ జైలుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ.. జాతీయ నాయకుడిగా మాత్రం గుర్తింపుపొందారు ఆ ఇష్యూలతోనే. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతలు దానినే గుర్తుచేస్తుంటారు. నాడు సోనియా గాంధీని ఢీకొట్టిన నేత ముందు మీరెంత? అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంటారు. అయితే రాజకీయ నేతలకు ఒక లెక్కుంటుంది. అధికారం అందుకునే వరకూ పోరాట బాట. తీరా అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకునేందుకు సర్దుబాటు ధోరణిలో వెళుతుంటారు. జగన్ ది కూడా సేమ్ సిట్యువేషన్. అధికారం నిలబెట్టుకోవాలన్నా… మరోసారి అధికారంలోకి రావాలన్నా తన ముందున్న కర్తవ్యం సర్దుబాటే తప్ప.. పోరాటం కాదని జగన్ గుర్తించుకున్నారు. అందుకే బీజేపీ పెద్దలతో విభేదాలు పెట్టుకునే సాహసం చేయలేకపోతున్నారు.

అయితే ఈ విషయంలో కేసీఆర్ పరిస్థితి వేరు. అక్కడ తనకు పోటీగా ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ లు. రెండూ జాతీయ పార్టీలే. పరస్పరం సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలే. ఆ రెండు పార్టీల కలయిక సాధ్యమయ్యే పనికాదు. అందుకే ముందుగా కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. అటు తరువాత బీజేపీపై యుద్ధం ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా విస్తరించే పనిలో పడ్డారు. కానీ జగన్ విషయంలో ఆ పరిస్థితి లేదు. ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. వైసీపీకి ధీటుగా టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి.అక్కడ కాంగ్రెస్, బీజేపీలు నామమాత్రమే. ఏ మాత్రం బీజేపీతో విభేదించినా.. మిగతా రెండు పార్టీలకు కేంద్ర పెద్దల సహకారం పుష్కలంగా లభిస్తుంది. అందుకే గతంలో పోరాటాలు సాగించిన జగన్… బీజేపీ విషయంలో మాత్రం తగ్గే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో చంద్రబాబు ఇటువంటి పోరాట బాట పట్టే రాజకీయంగా దెబ్బతిన్నారు. అదే సమయంలో తాను ఎంత లబ్ధిపొందానో జగన్ కు తెలుసు.
మరోవైపు తాను ఏపీలో అధికారంలోకి రావడానికి సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ పట్ల జగన్ కు మంచి అభిప్రాయమే ఉంది. అందుకే తిరిగి చాలా రకాలుగా సాయమందించారు కూడా. కానీ బాహటంగా మద్దతు తెలపలేని పరిస్థితి జగన్ కు దాపురించింది. ఒక వేళ కేంద్ర పెద్దల నుంచి పూర్తి సహాయ నిరాకరణ ప్రారంభమై.. జైలుకు మరోసారి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైతే మాత్రం జగన్ ముందున్న ఏకైక ఆప్షన్ కేంద్ర పెద్దలపై యుద్ధం ప్రకటించడమే. కానీ ఆ పరిస్థితి వస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలో ఓ వర్గం ఇప్పటికీ జగన్ కు సహకరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన కూడా బీజేపీని కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మదిలో ఏముందో తెలియడం లేదు. మున్ముందు బీజేపీ పెద్దల వ్యవహార శైలితో జగన్ తన భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంది. అప్పటి వరకూ సర్దుబాటే జగన్ కు శరణ్యం.