Chandrababu Telangana: ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న చంద్రబాబు మరో బాధ్యత తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి డిసైడ్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ పోటీచేసి చెప్పుకోదగ్గ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ కేసీఆర్ ఎత్తుగడలతో టీడీపీ నుంచి గెలిచిన వారంతా నాటి టీఆర్ఎస్ కు క్యూకట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూటమి కట్టిన చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అయితే టీడీపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. కానీ ఒక మోస్తరు పేరున్న నాయకులంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. అటు చంద్రబాబును కార్నర్ చేసుకొని కేసీఆర్ విసిరిన సెంటిమెంట్ అస్త్రం ప్రతీసారి పనిచేసింది. దీంతో తెలంగాణ విషయంలో చంద్రబాబు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ గా విస్తరించిన నేపథ్యంలో చంద్రబాబుకు కాస్తా వెసులబాటు దొరికింది. తెలంగాణలో మిగిలిన కేడర్ ను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో దాదాపు టీడీపీ కుదేలైంది. నాయకులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా మిగిలిపోయారు. ఈ సమయంలో చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తున్నా.. పార్టీకి ఎంతవరకూ గట్టున పడేస్తుందో చెప్పలేని పరిస్థితి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికీ తెలంగాణ వాదులు చంద్రబాబును రాజకీయంగా ద్వేషిస్తారు తప్ప.. ఒక నాయకుడిగా, పాలకుడిగా మంచి మార్కులే వేస్తారు. కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ గా విస్తరించి జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన వేళ.. చంద్రబాబు కేసీఆర్ పై ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. అటు ఏపీలో జగన్ కు కేసీఆర్ మిత్రుడు. వీరిద్దరికీ చంద్రబాబు ఉమ్మడి శత్రువు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఎటువంటి విమర్శలు, అస్త్రాలు బయటకు వస్తాయోనని తెలుగునాట చర్చ అయితే జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. ఇప్పటికీ అక్కడ టీడీపీ సానుభూతిపరులు, మంచి కేడర్ ఉంది. తెలంగాణలో రీఎంట్రి ఇవ్వాలని చంద్రబాబు భావించినప్పుడు ముందుగా పోకస్ పెట్టింది ఖమ్మంపైనే. కేసీఆర్ జాతీయ పార్టీ విస్తరణతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయ్యింది. అప్పటి నుంచే చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఏయే జిల్లాలు అనుకూలం. ఎక్కడ ఎలా ముందుకెళ్తే వర్కవుట్ అవుతుంది. పొత్తులతో పార్టీని కొంత లైమ్ లైట్ లోకి తీసుకురావచ్చని అంచనా వేశారు. అందుకే ముందుగా ఖమ్మం జిల్లాపై దృష్టిపెట్టారు. అటు తరువాత హైదరాబాద్, రంగారెడ్డి , వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరుసగా సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా పార్టీ బలమున్న 30 నియోజకవర్గాలపై పోకస్ పెంచినట్టు తెలుస్తోంది.

ఒక పక్క బీఆర్ఎస్ రూపంలో ఏపీలో అడుగుపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడు తెలంగాణలో రీఎంట్రీతో చంద్రబాబు హల్ చల్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టినంత ఈజీ కాదు కేపీఆర్ ఏపీలో అడుగుపెట్టడం. ఎందుకంటే ఏపీ ప్రజలను, నాయకులను తూలనాడుతూ కేసీఆర్ చేసిన కామెంట్స్ ను ఏపీ వాసులు ఇంకా మరిచిపోలేదు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అలాకాదు. ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసిన అనుభవం, ఆపై టీడీపీకి జవసత్వాలు ఉండడం, సెటిలర్స్ అధికంగా ఉండడంతో చంద్రబాబు ఈజీగా చొచ్చుకెళ్లే చాన్స్ ఉంది. తెలంగాణ రాజకీయాలతో ఏపీలో అధికారం అందిపుచ్చుకోవాలన్న ప్రయత్నం ఒక వైపు.. తనను రాజకీయంగా దెబ్బకొట్టిన కేసీఆర్ ను చెక్ చెప్పేందుకు మరోవైపు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని జాకీ పెట్టి మరీ లేపే ప్రయత్నం చేస్తున్నారు.