Homeజాతీయ వార్తలుKCR Vs Congress: కాంగ్రెస్ ను హైజాక్ చేస్తోన్న కేసీఆర్..!

KCR Vs Congress: కాంగ్రెస్ ను హైజాక్ చేస్తోన్న కేసీఆర్..!

KCR Vs Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కొత్త పథకాల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాంగానే ఇటీవల కాలంలో ఉద్యోగులకు కొత్త పీఆర్సి కమిటీ వేయడంతో సహా అనేక కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న కేసీఆర్‌ తాజాగా రైతులపై మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇవ్వకుండా వ్యూహాలు రూపొందిస్తున్నారు. తాజాగా రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్‌ పార్టీలో కంగారు పుట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రుణమాఫీ అనేది జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించిన క్రెడిట్‌ ఇసుమంతైనా కేసీఆర్‌ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ నాయకులు ఒక వ్యూహాత్మక ప్రచారాన్ని ఇప్పటినుంచి ప్రారంభిస్తున్నారు.

క్రెడిత్‌ తమదే అంటున్న పీసీసీ చీఫ్‌..
ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయం అని అభివర్ణించారు. క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ఒత్తిడి చేసిన ఫలితంగానే ఇవాళ రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నారని రేవంత్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఇటీవల కలసి రుణమాఫీ గురించి డిమాండ్‌ చేసినవైనం గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు దక్కకుండా కేటీఆర్‌ పిలుపు..
‘సక్సెస్‌ హేజ్‌ మెనీ ఫాదర్స్‌’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్‌ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్‌ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. కేసీఆర్‌ ఇచ్చిన హామీని కాస్త ఆలస్యంగా అయినా ఆయనే అమలులోకి తీసుకు వస్తున్నప్పటికీ మధ్యలో కీర్తి మాత్రం తమకు దక్కాలని కాంగ్రెస్‌ పార్టీ ఆరాటపడుతుంది. దీంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌.. రుణమాఫీ సంబరాలకు పిలుపునిచ్చారు.

కొత్త పథకాలకు కసరత్తు..
ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న ఈ తరుణంలో కేసీఆర్‌ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఈమేరకు కసరత్తు కూడా చేస్తున్నారు. రైతులకు పెన్షన్, ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు పెంపు అంశాలు కేసీఆర్‌ దృష్టిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త పథకాలు కూడా తమ పోరాటాల ఫలితమే అని కాంగ్రెస్‌ ప్రకటించుకునే అవకాశం ఉంది. ఈమేరకు టీపీసీసీ చీఫ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version