https://oktelugu.com/

కేసీఆర్ కారు.. బోరు? రిపేరు?

కారు రయ్ మంటూ.. దూసుకెళ్తున్నంతసేపు సౌఖ్యంగా ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదంగా సాగుతూ ఉంటుంది. కానీ.. కుదుపులు మొదలైతే కాస్త అసౌకర్యం. అదే.. రిపేరు అయితే? పలు ఇబ్బందులు పడి, ఆలస్యంగా నైనా ప్రయాణం కొనసాగుతుంది. కానీ.. బోరుకు వస్తే..?? బండి షెడ్డుకు పోవాల్సిందే..! మరి, దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ కారు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? కుదుపులా? రిపేరా? బోరా..?? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. యాదృశ్చికంగా.. టీఆర్‌ఎస్‌ రెండోసారి పాలన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 04:07 PM IST
    Follow us on


    కారు రయ్ మంటూ.. దూసుకెళ్తున్నంతసేపు సౌఖ్యంగా ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదంగా సాగుతూ ఉంటుంది. కానీ.. కుదుపులు మొదలైతే కాస్త అసౌకర్యం. అదే.. రిపేరు అయితే? పలు ఇబ్బందులు పడి, ఆలస్యంగా నైనా ప్రయాణం కొనసాగుతుంది. కానీ.. బోరుకు వస్తే..?? బండి షెడ్డుకు పోవాల్సిందే..! మరి, దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ కారు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? కుదుపులా? రిపేరా? బోరా..?? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. యాదృశ్చికంగా.. టీఆర్‌ఎస్‌ రెండోసారి పాలన కూడా రేపటితో (డిసెంబరు 13) రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంలో టీఆర్ఎస్ గతాన్ని, వర్తమానాన్ని గుణిస్తూ.. భవిష్యత్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం…

    Also Read: మేయర్ ఎన్నిక.. చెయ్యెత్తి జై కొట్టుడే..!

    ఆరున్నరేళ్ల జోరు..
    2014లో ఘన విజయం సాధించింది మొదలు.. దుబ్బాక ఉప ఎన్నిక వరకు కారు వేగం ఎక్కడా తగ్గలేదు. ఒకటీ రెండు చోట్ల సాధారణ స్పీడు బ్రేకర్లు తప్ప, ఎక్కడా అడ్డంకులు ఎదురుకాలేదు. ఎలాంటి ఎన్నికలైనా సరే.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ దోస్తీ కట్టినా కారు జోరు ఆపలేకపోయారు. కానీ.. ఆ తర్వాత మార్పు మొదలైంది.

    ముందస్తు ఎన్నికలతో..
    మొదటి దఫా పాలనలో దాదాపు ఆరు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల ఫలితాలు 2018 డిసెంబరు 11న వెలువడగా 13న కేసీఆర్‌ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ జెండా తెలంగాణలో రెపరెపలాడుతోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎదురు లేని పరిస్థితి. దీంతో తనయుడికి తెలంగాణ బాధ్యతలు అప్పగించి, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారనే ప్రచారం సాగింది. కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ గురించి తరచూ మాట్లాడేవారు. అనుకున్నట్టుగానే.. కొడుకు కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం ఆరు నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కారు దెబ్బ తిన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 113 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన కమలం.. లోక్‌సభ ఎన్నికల్లో వికసించింది. రాష్ట్రంలో ఏకంగా నాలుగు సీట్లు కైవసం చేసుకుంది. సారు.. కారు.. పధారు అనే నినాదంతో జనాల్లోకి వెళ్లిన కేసీఆర్.. 16 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించారు. కానీ.. టీఆర్‌ఎస్‌ తొమ్మిది సీట్లకే పరిమితమైంది. దీంతో కేసీఆర్ రాష్ట్రంపైనే దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పంచాయతీ.. ఆ తర్వాత జరిగిన పరిషత్తు, మునిసిపల్‌ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగరేసింది. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలోనూ జెండా ఎగరేసి తనకు ఎదురు లేదని చాటి చెప్పింది.

    మళ్లీ మారిన రాజకీయం..
    దుబ్బాక ఎన్నికల ఫలితం వరకూ టీఆర్ఎస్ సత్తా గురించి ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. కానీ.. దుబ్బాకలో కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో పరిస్థితి మారింది. కాషాయ దళం అదే ఊపుతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కొంది. అక్కడ కూడా ఊహకందని రీతిలో బీజేపీ సత్తా చాటడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మొదలైంది. ఈ రెండు ఫలితాలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక భావనతో ఉన్నారని రుజువు చేశాయి. రాష్ట్రంలో ప్రత్యర్థి ఉండకూడదని కాంగ్రెస్ ను ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసిన ఫలితమే ఇదంతా అనే విమర్శలు వ్యక్తమయాయి.

    Also Read: ‘చిత్రపురి’కి కొత్త బాస్ ఎవరంటే?

    ఇక అగ్ని పరీక్ష..
    దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా బీజేపీపై పైచేయి సాధించాల్సిన అనివార్య పరిస్థితిలో ఉంది టీఆర్‌ఎస్. దీంతో.. త్వరలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ సహా పలు మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అధికార పార్టీగా టీఆర్ ఎస్ తన సత్తా చాటాల్సి ఉంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ.. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌ మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. వీటిలో ఖమ్మం కార్పొరేషన్‌ మినహా అన్నిచోట్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దాంతో, ఈ ఎన్నికల్లో గెలిచి.. పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత అధికార టీఆర్‌ఎస్ కు ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికలు చావో, రేవో అన్నట్టుగా తయారు కానున్నాయి.

    నాగార్జున సాగర్ పైనా..
    నాగార్జున సాగర్‌ సిట్టింగ్ సీటు కాబట్టి, ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. అలాకాకుండా, మంచి ఓటు బ్యాంకు, జానారెడ్డి వంటి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటే ఆ పార్టీకి పెద్ద ఊరటే. వీరిద్దరూ కాకుండా.. ఇక్కడ కూడా బీజేపీ అద్భుతాన్ని నమోదు చేస్తే మాత్రం.. ఇక, కారు ప్రయాణం మరింత సంక్లిష్టం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విధంగా.. రాబోహే ఎన్నికలన్నీ టీఆర్‌ఎస్ కు అగ్ని పరీక్షగా అభివర్ణిస్తున్నారు.

    కేసీఆర్ ఏం చేయనున్నారు?
    2014లో అధికారం సాధించిన తర్వాత కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్నడూ ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోలేదు. మరి, దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు? రాబోయే ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? గెలిచి కారు వేగం తగ్గలేదని నిరూపిస్తారా? కారు బోరుకొచ్చిందని చాటి చెప్తారా?? అన్నది చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్