Bandi Sanjay Padayatra: పాదయాత్ర.. పవర్ ఫుల్ యాత్ర. ఈ యాత్ర చేసిన నేతలందరికీ రాజ్యాధికారం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ యాత్రతో ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ లు నడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు తెలంగాణలో ఈ ట్రెండ్ మొదలైంది. ఓవైపు షర్మిల.. మరోవైపు బండి సంజయ్ పాదయాత్రల పరంపర కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు యువత, గ్రామాల్లో విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే దానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో ఉందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళన శృతి మించింది. వారిపై హత్య కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించి పాదయాత్ర చేస్తున్న జనగామ జిల్లాలోనే ‘దీక్ష’కు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బండిని అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు.

ఈ క్రమంలోనే బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులు జారీచేయడం సంచలనమైంది. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులు జారీ చేసిన వర్దన్నపేట ఏసీపీ.. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసులో తెలిపిన పోలీసులు.. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
– ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదంటున్న బీజేపీ నేతలు
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు… ఇప్పుడెందుకు? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామన్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తాం. ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతాం.పాదయాత్ర ముగింపుకు సభకు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారని వారు తెలిపారు

-పాదయాత్రను ఆపను.. పోరాడిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్యాఫ్ : బండి సంజయ్ కుమార్
పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ గూండాలపై, పోలీసులపైనా వీరోచితంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్యాఫ్ అని బండి సంజయ్ కుమార్ అన్నారు. పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపనన్నారు. లిక్కర్ స్కాంలో ప్రమేయమున్న ఎమ్మెల్సీ కవిత నివాసం ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తూ పోలీసుల నిర్బంధాన్ని, టీఆర్ఎస్ గూండాల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న బీజేపీ కార్యకర్తలకు నా సెల్యూట్ అని అన్నారు. కేసులు పెట్టి బెదిరించినా… హత్యాయత్నం కేసు నమోదు చేసినా భయపడకుండా ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.
[…] […]
[…] […]