https://oktelugu.com/

KCR on BJP : కేసీఆర్ సారు ఆదేశించడాలేనా..? పాటించడాల్లేవా??

KCR on BJP : ఆ దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు అంటాడు రజినీకాంత్. సినిమా కాబట్టి పాటించడానికేముంది? అలాక్కానిస్తాడు. కానీ.. నిజ జీవితంలో మనుషులు అలా ఎందుకు ఉంటారు? ఉండరుగాక ఉండరు. కాబట్టి.. ఆదేశాలు జారీచేసిన “దేవుడే” ముందు నిలవాల్సి ఉంటుంది. అప్పుడుగానీ.. వెనకపొంటి కదిలిరారు భక్తులు అనబడే కార్యకర్తలు! ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల పరిస్థితి సరిగ్గా ఇట్లానే ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీపై ఇక సమరమే…. అని ఇటీవల […]

Written By:
  • Rocky
  • , Updated On : December 20, 2021 / 01:52 PM IST
    Follow us on

    KCR on BJP : ఆ దేవుడు ఆదేశిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు అంటాడు రజినీకాంత్. సినిమా కాబట్టి పాటించడానికేముంది? అలాక్కానిస్తాడు. కానీ.. నిజ జీవితంలో మనుషులు అలా ఎందుకు ఉంటారు? ఉండరుగాక ఉండరు. కాబట్టి.. ఆదేశాలు జారీచేసిన “దేవుడే” ముందు నిలవాల్సి ఉంటుంది. అప్పుడుగానీ.. వెనకపొంటి కదిలిరారు భక్తులు అనబడే కార్యకర్తలు! ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల పరిస్థితి సరిగ్గా ఇట్లానే ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీపై ఇక సమరమే…. అని ఇటీవల మరోసారి గులాబీ దళపతి ప్రకటించిన సంగతి తెలిసిందే..

    ఎవరక్కడ..? బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలు సిద్ధం చేయండి.. ఒకరు వరిగడ్డి తెండి.. మరొకరు కుండ తీసుకు రండి.. ఇంకొకరు పాత అంగి, పాయింటు పట్టుకు రండి.. అందరూ కలిసి ఊరేగించండి.. సెంటర్లో తగల బెట్టండి.. అని ఆదేశాలు జారీచేశారు. దీనికి శ్రేణులు సిద్ధంగానే ఉండి ఉండొచ్చు.. కానీ, మీరు కానివ్వండి నేను మధ్యలో జాయిన్ అవుతాననే నాయకుల మాదిరిగానే అధిష్టానం వ్యవహరిస్తుండడంతో.. కార్యకర్తలు కూడా లైట్ తీసుకుంటున్నారట! దీంతో.. అధినేత పూరించిన సమర శంఖం ప్రెస్ మీట్లకే పరిమితం కావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి గలాబీ దళంలో!

    నిజానికి.. రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే రాజకీయ పరిస్థితులు ఊపందుకున్న ప్రతిసారీ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నారు కేసీఆర్. అది విని గులాబీ శ్రేణులంతా సమర సైనికుల్లా ఊగిపోవడం.. ఆ తర్వాత అంతా చల్లారిపోవడం రివాజుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు సార్లు కురుక్షేత్రం ముందు పూరించిన శంఖంలా యుద్ధం ప్రకటించారు కేసీఆర్. కానీ.. అదంతా మాటలకే పరిమితమైందన్నది ప్రధాన విమర్శ. తెలంగాణలో యుద్ధం ప్రకటించి.. ఢిల్లీలో మంతనాలు చేసిరావడం రివాజుగా మారిందని అంటున్నారు.

    ధాన్యం సేకరణ విషయమై ఇటీవల మరోసారి కేంద్రంతో, బీజేపీతో టీఆర్ఎస్ కు పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా.. మూడోసారి నిరసనలకు పిలుపునిచ్చింది అధిష్టానం. కానీ.. ఆ నిరసనల్లో కేసీఆర్ ఎక్కడా పాల్గొనట్లేదు. ఆయనే కాదు.. కేటీఆర్, కవిత కూడా ఎక్కడా కనిపించట్లేదు. దీంతో.. గులాబీ శ్రేణులు కూడా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మంత్రులు కూడా.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే విషయంలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఫలితంగా.. ఈ సారి కూడా బీజేపీ పై యుద్ధం అనేది రొటీన్ స్టేట్ మెంట్ గానే మిగిలిపోతుందా? అనే సందేహం గులాబీ కేడర్లోనే వ్యక్తమవుతోంది. మరి, దీనిపై అధిష్టానం ఏం చేస్తుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.