Delhi Liquor Scam Case: కవిత భవిష్యత్తు సుప్రీంకోర్టు చేతిలో.. ఏం జరుగనుంది?

వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు వినిపించిన నాటి నుంచి ఈ వ్యవహారంలో పరిణామాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

Written By: Bhaskar, Updated On : September 26, 2023 12:53 pm

Delhi Liquor Scam Case

Follow us on

Delhi Liquor Scam Case: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మంగళవారం ప్రారంభించింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులపై టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి దీనిని విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. కవితకు నోటీసులు అందిన విషయాన్ని గత విచారణలో న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాగా.. 10 రోజుల పాటు ఆమెను పిలవబోమని ఈడీ హామీ ఇచ్చింది.

అయితే ఒకవేళ కవితకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఈ డి అధికారులు కచ్చితంగా ఆమెను విచారిస్తారు.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక అన్ని నిందితులు అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో వాటి ఆధారంగా ఆమె నుంచి మరింత కీలకమైన సమాచారం రాబడతారు. ఒకవేళ ఆమె సహకరించని పక్షంలో మరింత సమాచారం సేకరించేందుకు కోర్టు అనుమతితో విచారణకు పిలుస్తారు. ఇలా పలుమార్లు విచారణ నిర్వహించిన తర్వాత ఇంకా పూర్తి వివరాల కోసం తదుపరి చర్యలకు సమాయత్తమవుతారు. ఎందుకంటే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలోనూ ఇదే జరిగింది. ఇక మిగతా సౌత్ గ్రూప్ కు చెందిన వారి విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించింది.

వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు వినిపించిన నాటి నుంచి ఈ వ్యవహారంలో పరిణామాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. అయితే కవితను విచారించే క్రమంలో ఈడి అధికారులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. ఆమె ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ కు వెళ్లిందని, విలువైన ఐఫోన్లను ధ్వంసం చేసిందని, వట్టి నాగులపల్లి లో భూములు కొనుగోలు చేసిందని పలు లీకులు ఇచ్చింది. ఆ తర్వాత రెండు సార్లు ఆమెను విచారించింది. తర్వాత ఏం జరిగిందో కానీ ఈ కేసు ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. అయితే మంగళవారం సుప్రీంకోర్టు కేసును విచారిస్తున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించే తీర్పు కోసం ప్రగతి భవన్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి న్యాయవిభాగం నిపుణులు కొంతమంది ఢిల్లీ వెళ్లి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కవితకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలి అనే విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.