Kalvakuntla Kavitha: రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సాదాసీదాగా సాగిన రాజకీయ కార్యకలాపాలు.. ఇప్పుడు వేగంగా కదిలిపోతున్నాయి. హుజూరాబాద్ ఫలితం, ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. బండ ప్రకాశ్ పదవి కాలం 2024 వరకు ఉంది. కానీ ఆయనకు ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనుండటంతో కవితకు రాజ్యసభ సీటు ఇవ్వడం ఇక ఖాయమే అని తెలుస్తోంది.

మళ్లీ ఎంపీగా వెళ్లనున్న కవిత..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉద్యమ సమయంలో కల్లకుంట్ల కవిత అందరి దృష్టిని ఆకర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఆమె నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ విజయం సాధించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పథకాల విషయంలో పార్లమెంటులో మాట్లాడారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనయగా ఆమె సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నిజామాబాద్‌లో ఎర్పడ్డ ప్రత్యేక పరిస్థితులు ఆమెను ఓటమి చవిచూసేలా చేశాయి.
నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఐదేళ్లు గడిచినా దానిని తీసుకురాకపోవడం, కవితపై రాజకీయ నాయకుల్లో ఏర్పడ్డ అసంతృప్తి వల్ల ఆమె అప్పుడు ఓడిపోయిందని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి ఆమె క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతో ఆమెను అదే జిల్లా నుంచి ఎమ్మెల్సీగా చేశారు సీఎం కేసీఆర్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భూపతి రెడ్డి అనర్హత ఎదుర్కోవడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ టీఆర్ఎస్ కే చెందిన వారు ఉండటంతో ఆమె సునాయాసంగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే కవిత పదవీకాలం 2022 జనవరితో ముగియనుంది. అందుకే ఆమెను రాజ్యసభకు పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైతే 2024 వరకు ఎంపీగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో వచ్చే సారి కూడా తామే అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీ పదవుల పంపకం చేపడుతోంది. అసంతృప్తులకు మళ్లీ అవకాశం ఇస్తామని చెబుతోంది. పార్టీ క్యాడర్‌ను మాత్రం చేజారిపోకుండా చూసుకుంటోంది.
Also Read: మూడోసారి అధికారమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు.. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు
రెడ్డి వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటున్న కేసీఆర్.. అసలు కారణం ఇదే?