Kavitha vs MP Aravind : తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మారోమారు యుద్ధ వాతావరణం ఏర్పడింది. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి జరిగిన ఎన్నికల్లో అర్వింద్ కవితపై విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయంగా పడటం లేదు. ఏ సమస్య వచ్చినా ఇద్దరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం మామూలుగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ వారి మధ్య ప్రత్యక్ష యుద్ధానికి అర్వింద్ ఆరోపణలే కారణమని చెబుతున్నారు. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో అని అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న మరో దాడిగా అభివర్ణిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రెండు పార్టీల్లో వైషమ్యాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు.. ఎమ్మెల్సీ కవితకు మధ్య రాజకీయ వైషమ్యాలు మరోసారి భగ్గుమన్నాయి. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శుక్రవారం హైదరాబాద్ లోని ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇల్లంతా చిందర వందర చేశారు. వస్తువులన్ని ధ్వంసం చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ రగడ రేగింది. టీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన పనికి రెండు పార్టీల్లో విభేదాలు తీవ్ర స్థాయిలో ముదిరాయి. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకుంటాయనే అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అర్వింద్ ప్రకటనలు చేయడంపై కవిత కూడా మీడియా సమావేశం పెట్టి మరీ ఫైర్ అయ్యారు. అర్వింద్ చేసిన ఆరోపణలతో కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజామాబాద్ నడిరోడ్డులో చెప్పుతో కొడతానని పరుష పదజాలాన్ని ఉపయోగించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతుతోనే అరవింద్ యాక్సిడెంటల్ గా ఎంపీ అయ్యారని.. ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా ఓడిస్తామని తెలిపారు. రాజకీయాలు చేయాలని కానీ వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం సమంజసంగా లేదని హితవు పలికారు.

కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పార్టీ మారుతున్నారని.. ఆమె కాంగ్రెస్ లో చేరబోతోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ మాటలే అగ్గిరాజేశాయి. అంతేకాదు కవితపై నోరుపారేసుకున్నారు. కవితను కించపరిచేలా మాట్లాడారు. దీనిపై అటు కవిత.. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించి ధ్వంసం చేశారు. ఇక ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. అరవింద్ తో ఫోన్ లో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతే తట్టుకోలేరంటూ టీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ లో చేరుతోందని అంటే తన ఇంటిపై దాడి చేయించిన కవిత.. మరి బీజేపీలో చేరుతుందని అన్న కేసీఆర్ ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఎవరినీ వదిలిపెట్టమని.. ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కవిత 2024 ఎన్నికల్లో తనపై పోటీచేసి గెలవాలని ఎంపీ అరవింద్ సవాల్ చేశారు.
నిజానికి కవితను బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నించారని కేసీఆర్ ఇటీవలే బాంబు పేల్చారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ మాత్రం ఆమె కాంగ్రెస్ లో చేరుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తనను టార్గెట్ చేయడంపై కవిత బరెస్ట్ అయ్యి ఇలా ప్రతిదాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మొత్తంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల దెబ్బకు ఎంపీ కవిత షేక్ అయిపోయింది. గట్టి కౌంటర్ ఇచ్చింది. అటు వ్యక్తిగతంగా భౌతికంగా దాడులకు దిగింది. మరి ఈ ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుందన్నది వేచిచూడాలి.