Telangana Elections 2023: ఆ బాలిక వయసు మహా అయితే పదిహేను సంవత్సరాలు ఉంటాయి కావచ్చు.. తన ఈడు పిల్లలతో ఆడి పాడాల్సిన వయసులో గులాబీ జెండా మెడలో వేసుకుంది. సరే వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి.. ఉత్సాహంతో వేసుకుంది అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకున్నారు. గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే సర్లే అని సర్దుకున్నారు. కానీ శుక్రవారం తమ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడటం.. ఏకంగా వెయ్యి కోట్ల ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు అవాక్కయ్యారు.. ఇంతకీ ఎవరు ఆ బాలిక? ఏమా కథా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
బిడ్డ రంగంలోకి దిగింది
హుజరాబాద్ తెలుసు కదా! బిజెపి రాష్ట్ర నాయకుడు ఈటెల రాజేందర్ నియోజకవర్గం. అక్కడ ఆయన వరుసగా ఏడుసార్లు విజయం సాధించాడు. గతంలో భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి ఉండేవారు. ఈయన పలుమార్లు ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. ఈటల రాజేందర్ భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా విప్ పదవి కూడా కేటాయించారు. అప్పటినుంచి కౌశిక్ రెడ్డి ఆ నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ తో పోటీ పడుతున్నారు. తన తండ్రి వరుస ఓటమిలు చవిచూడటంతో తట్టుకోలేని ఆయన బిడ్డ రంగంలోకి దిగింది. ఏకంగా ఓటర్లను బతిమిలాడే ప్రయత్నం చేస్తోంది.
1000 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది
ఇక నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగాని కంటే ముందు కౌశిక్ రెడ్డి కూతురు మాట్లాడింది.. తన తండ్రి నియోజకవర్గానికి ఎంతో చేస్తున్నాడని, ఈసారి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరింది. ప్లీజ్ మా డాడీ ని గెలిపించండి.. 1000 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఓటర్లకు ప్రామిస్ చేసింది. అంతేకాదు తన తండ్రికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం అని, ఇప్పటికే మీరు పలుమార్లు ఓడించి ఇబ్బందికి గురి చేశారని వాపోయింది. తన తండ్రి అంటే తనకు ప్రాణమని, ఆయన బాధపడితే చూడలేనని కన్నీరు పెట్టుకుంది. కాగా కౌశిక్ రెడ్డి కూతురు మాట్లాడుతున్నంత సేపు ఓటర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. కౌశిక్ రెడ్డి కూతురు మాట్లాడిన తర్వాత ఆయన భార్య రంగంలోకి దిగింది. నా కొంగు చాపి మిమ్మల్ని అడుగుతున్నా.. ఓట్లు వేసి మా ఆయనను గెలిపించండి అంటూ ప్రాధేయపడింది.. కాగా, కౌశిక్ రెడ్డి కూతురు, భార్య మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో దళితులను కొట్టినప్పుడు, కులం పేరుతో దూషించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు అంటూ నెటిజన్లు వారిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈటల రాజేందర్ గులాబీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కౌశిక్ రెడ్డికి కేసీఆర్ నుంచి సహకారం అందిందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు భార్యను ఇటుకూతురును ఎన్నికల ప్రచారంలోకి దించి రాజకీయాలు చేయించడం సరికాదని కౌశిక్ రెడ్డికి రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. భార్య, కూతురి ప్రచారం కౌశిక్ రెడ్డికి ఏ మేరకు కలిసి వస్తుందో డిసెంబర్ 3న తేలిపోతుందని హుజురాబాద్ ఓటర్లు అంటున్నారు.