Karur stampede: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ ప్రాంతంలో ఇటీవల తొక్కేసలాట జరిగిన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 41 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్ మీద ఆరోపణలు మొదలయ్యాయి. అధికార డిఎంకె పార్టీ ఈ ఘటనపై కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. చనిపోయిన వారికి పది లక్షలు.. గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. మంత్రులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇదంతా కూడా టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని మండిపడ్డారు. తమిళనాడు భావి నాయకుడు కావాలని భావిస్తున్న విజయ్.. ఇలాంటి బాధ్యతారాహిత్యానికి పాల్పడటం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
ఇక ఈ ఘటన తర్వాత టీవీకే పార్టీ మీద విమర్శలు మరింత పెరిగాయి. అయితే విజయ్ ఒక్కసారిగా సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఆరోజు ఏం జరిగింది? ఎలా జరిగింది? అందులో అధికార డిఎంకె పార్టీ పాత్ర ఎంత? తాను ఎందుకు మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది? ఈ విషయాలపై విజయ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.. దీంతో ఒక్కసారిగా ఈ సంఘటన మరో టర్న్ తీసుకుంది. అప్పటిదాకా విజయ్ ని చూపించిన అన్ని వేళ్ళూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో కరూర్ ఘటన తమిళనాడులో రాజకీయంగా సంచలనంగా మారింది. అటు టీవీకే విమర్శలు.. డీఎంకే విమర్శలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో మధ్యలోకి బిజెపి కూడా ఎంట్రీ ఇచ్చింది. అధికార డిఎంకెను విమర్శిస్తూ బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామలై, కుష్బూ వంటి వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఒక నివేదిక కూడా రూపొందించారు.
కరూర్ ఘటన నేపథ్యంలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు కీలకమైన నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణమని తేల్చారు. జనాల సంఖ్య పై అంచనా లేమి వల్ల ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో విఫలం చెందారని పేర్కొన్నారు. 3000 మంది మాత్రమే పట్టే సామర్థ్యం ఉన్న మైదానంలో 30 వేల మంది వచ్చారని.. రెండు గంటలకు రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటలకు వచ్చారని.. ఆయన బస్సు పైకెక్కి అభిమానం చేస్తుండగానే ఈ దారుణం జరిగిందని ఎన్డీఏ ఎంపీలు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని నివారించవచ్చని.. కానీ అధికార యంత్రాంగం కావాలని చేతులెత్తేసిందని ఎన్డీఏ ఎంపీలు తమ నివేదికలో పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ ఘటన జరిగిన సమయంలో ప్రభుత్వం కావాలని రాకపోకలను నిలిపివేసిందని టీవీకే నేతలు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే ఎన్డీఏ ఎంపీల నివేదిక ఉండడం విశేషం. ఈ నివేదిక ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ నివేదిక ఆధారంగా తమిళనాడు పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులోకి ప్రవేశిస్తాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.