CM KCR: “ఎవ్వడి కోసం ఎవడున్నాడు. పొండిరా పొండి. నా కాలం, కర్మం కలిసొస్తే.. రండి రా రండి”వెనకటికి ఓ సినిమాలో జనాల్ని బాగా కట్టిపడేసిన పాట ఇది.. ఈ పాట కెసిఆర్ రాజకీయ ప్రయాణానికి సరిగ్గా సూట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే అంతలా ప్రభావం చూపించింది కర్ణాటక రాష్ట్రం.. మొన్న జరిగిన ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఇచ్చిన ఫలితంతో కమలం కూసాలు కదిలాయి. ఇక చక్రం తిప్పుతానుకున్న కుమారస్వామికి తల బొప్పికట్టే ఫలితాలు వచ్చాయి.. ఇక ఈయనకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ కు చుక్కలు కనిపించాయి..అసలే పార్టీ పేరు మార్చుకున్న తర్వాత, ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటున్న తర్వాత ఇలాంటి ఫలితం రావడం అటు భారతీయ జనతా పార్టీకే కాదు ఇటు భారత రాష్ట్ర సమితికి కూడా మింగుడు పడటం లేదు. సరే ఈ ఫలితం బిజెపికి ఎలాంటి గుణపాఠాలు చెప్పిందో.. భారత రాష్ట్ర సమితికి కూడా అలాంటి అనుభవాన్నే పరిచయం చేసింది. ఇక మొన్నటిదాకా ప్రధానమంత్రికి తానే ప్రత్యామ్నాయమని ప్రకటించుకున్న కేసీఆర్.. కనీసం ఆ దిశగా కామెంట్లు కూడా చేయడం లేదు. ఆయన గుమస్తా పత్రిక కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రచురించడం లేదు.
అప్పుడు టచ్ లో ఉన్నట్టు..
కేంద్రంలోని బీజేపీని గద్దె దించడంకోసం ఆయా రాష్ట్రాల్లోని నేతలను కలుపుకొని పోతానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. పలువురితో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. అయితే, మారిన పరిస్థితుల్లో ఆయన వెంట ఎవరుంటారన్నది అనుమానాస్పదంగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. నితీశ్‌కుమార్ కేసీఆర్‌తో కలవరు. మమతాబెనర్జీ కలిసి నడవరు. కుమారస్వామి వచ్చినా.. కర్ణాటకలో ఆయన అంతగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఏ పార్టీకీమెజారిటీ రాదని, హంగ్ వస్తే కుమారస్వామి కింగ్‌మేకర్ అవుతారని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారు. జేడీఎస్ ను అడ్డం పెట్టుకొని ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించారు. తాజా ఫలితాలతో షాక్ తిన్నారు. జాతీయ రాజకీయాల్లో జేడీఎస్ తమకు ఉపయోగపడుతుందని భావించినప్పటికీ ఆ పార్టీ ప్రభావం అంతంతేనని తేలింది. కుమారస్వామి తోడుగా ఉన్నా.. జాతీయంగా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది. మారిన పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై కాకుండా.. రాష్ట్రంపైనే దృష్టి పెట్టడం అవసరమని బీఆర్‌ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
మహారాష్ట్ర స్థానికం పైనా డౌటే?
మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు, ఆయా సంఘాల ప్రతినిధులు చెప్పుకోదగ్గ సంఖ్యలో బీఆర్‌ఎస్ లో చేరుతున్నారు. ఆ రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు కసరత్తు సాగుతోంది. ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తున్నట్లు పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ ప్రకటించింది. మహారాష్ట్రలోని బోకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడింది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో మహారాష్ట్రలో ముందుకెళ్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయా? అన్న సందిగ్ధం నెలకొంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం డౌటే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పోటీ చేసినా.. కొన్ని స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విపరీతమైన వ్యతిరేకత
ఇక భారత రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. మొన్నటికి మొన్న భారత రాష్ట్ర సమితి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటకలోనూ ఎమ్మెల్యేలు ఇదే స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో అక్కడ బిజెపి ఓడిపోయింది. ఇక్కడ కూడా భారత రాష్ట్ర సమితి నేతలు అలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Karnataka result 2023 kcr wants to change his strategy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com