Karnataka Elections 2023: కన్నడ సీమలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అంతా ప్రచారంలో తల మనకలయ్యారు. అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఓటర్ల పై వరాల జల్లు కురిపించారు. అయితే మొన్నటిదాకా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉండేవి. సర్వే సంస్థలు కూడా అదే విషయాన్ని పలుమార్లు చెప్పాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే సమయంలో బిజెపిలో అంతర్మథనం మొదలైంది. అయితే ప్రధానమంత్రి ప్రచారంలోకి దిగిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఫలితాలు ఇలా..
గత రెండు వారాల క్రితం సి ఓటర్ అనే సంస్థతో కలిసి టీవీ9 కన్నడ సర్వే నిర్వహించింది.. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 116 సీట్లు వస్తాయని చెప్పింది.. అంతకుముందు ఆ సంస్థ ఏబీపీ హిందీ ఛానల్ కోసం నిర్వహించిన సర్వేలో 116 నుంచి 126 సీట్లు వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. ఇప్పుడు టీవీ 9 కన్నడ ఛానల్ సొంతంగా చేసిన సర్వే ఫలితాలు విడుదల చేసింది.. ఇందులో 105 నుంచి 110 వరకు బిజెపికి వస్తాయని అంచనా వేసింది.. కాంగ్రెస్ పార్టీకి నుంచి 90 నుంచి 97 స్థానాలు, జెడిఎస్ కు 19 నుంచి 22 స్థానాలు, ఇతరులకు ఐదు స్థానాలు రావచ్చని అంచనా వేసింది.
మరో సర్వేలో..
ఏషియన్ నెట్ సువర్ణ న్యూస్ చేసిన మరో సర్వేలో భారతీయ జనతా పార్టీకి 100 నుంచి 114 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 86 నుంచి 98, జేడీఎస్ కు20 నుంచి 26, ఇతరులకు ఐదు సీట్ల వరకు వస్తాయని వెల్లడించింది. ఇక ఇదే చానల్ గత సర్వేలో భారతీయ జనతా పార్టీకి 98 నుంచి 109, కాంగ్రెస్ పార్టీకి 89 నుంచి 97, జెడిఎస్ కు 25 నుంచి 29, ఇతరులకు ఒక సీటు వస్తుందని అంచనా వేసింది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీ నాయకులు చేస్తున్న పొరపాటు పోటాపోటీ స్థితికి తెచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక లింగాయత్ ముఖ్యమంత్రులు అవినీతిపరులని సిద్ధరామయ్య అనడం, లింగయ్య డ్యామ్ తెగిపోయిందని వారి ఐక్యత దెబ్బతినేలా డీకే శివకుమార్ వంటి వారు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ప్రధానమంత్రిని విషపూరితమైన పాము అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనడం అగ్నికి ఆజ్యం పోసింది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చెప్పడం, దానిని వారి ఎన్నికల ప్రణాళికలో చేర్చడం భారతీయ జనతా పార్టీకి సరికొత్త శక్తిని ఇచ్చింది.
సిద్ధరామయ్య పెద్ద జోక్ చేశాడు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ మీద ఉన్న దాదాపు 187 కేసులను సిద్ధరామయ్య ప్రభుత్వం అప్పట్లో వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు అదే పార్టీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై నిషేధం ఇస్తామనడం పెద్ద జోక్ అయింది. ఉగ్రవాద ఛాయలు ఉన్న ఒక సంస్థను బజరంగ్ దళ్ ను ఓకే గాటిన కట్టడం హిందుత్వ శక్తులకు, తటస్థులకు కోపం వచ్చేలా చేసాయి. ఇక ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రచారం సరికొత్త బూస్ట్ ఇచ్చింది. ఇక ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సైలెంట్ గా ప్రచారం చేస్తున్నారు.. వందకు పైగా నియోజకవర్గాలను చుట్టి వచ్చారు.. యడ్యూరప్ప స్థాయిలో కాకున్నా లింగాయత్ లను భారీగానే ఆకట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో
ఇక కర్ణాటక కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధ రామయ్య వంటి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఏమాత్రం రేసులోకి వచ్చినా ఆ ఘనత మొత్తం సిద్ధరామయ్య, శివ కుమార్ కి వెళ్తుంది.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలం ముస్లిం, క్రిస్టియన్, గౌడ, కురుబ, ఎస్సీ ఓటర్లు. వీరిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార వీడియోలు రూపొందించింది. అవి ఆయా సామాజిక వర్గాల్లోకి బలంగా వెళ్లాయి. అయితే వాటి ద్వారా వచ్చే లాభాల్ని డైవర్ట్ చేసుకున్న తప్పుకూడా కాంగ్రెస్ పార్టీ నాయకులదే.
కుమార స్వామి దే
జెడిఎస్ భారం మొత్తం కుమారస్వామి మోస్తున్నారు. ఆరు నెలలుగా ఒక్కడే తిరుగుతున్నాడు. పంచరత్న పేరుతో తాను అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి వివరిస్తున్నాడు. అన్ని సర్వేలు తక్కువగా అంచనా వేస్తున్నప్పటికీ తన పార్టీకి 40 వరకు స్థానాలు వస్తాయని కుమారస్వామి చెబుతున్నాడు. అయితే కుమారస్వామికి ఆయన పార్టీ నే పెద్ద మైనస్.