Karnataka Elections: మరో ఐదు రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.. హోరాహోరీగా ఓటర్ల మీద వరాల జల్లు కురిపిస్తున్నాయి. మేనిఫెస్టోల్లో ఆయాచిత లబ్ధి కలిగిస్తామని ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పార్టీల ప్రచారస్త్రాలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాన పార్టీల ఎన్నికల ప్రణాళికలు కర్ణాటక ప్రచార స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. అవినీతి, లింగాయత్ ముఖ్యమంత్రి, నేతల ఫిరాయింపులు, తాజాగా ధార్మిక సంస్థల అంశం ప్రచారంలో వేడి పుట్టిస్తున్నది.
అవినీతి
ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే 40% కమిషన్ అనేది ప్రాచుర్యం పొందింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే మల్లికార్జున ఖర్గే వరకు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు “క్యూఆర్ కోడ్ సీఎం” అంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఆ పార్టీకి చాలా బలాన్ని తీసుకొచ్చింది. అయితే ఇదే దశలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా యూపీఏ ప్రభుత్వం పాల్పడిన 85% కమిషన్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దీనిని కర్ణాటక వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎవరు సీఎం
ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ప్రధాన పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అంశం పై జోరుగా ప్రచారం సాగింది. భారతీయ జనతా పార్టీని నడిపించే నాయకుడు ఎవరూ లేరని, ఎన్నికల తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార సభలో ప్రశ్నించారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా బదులిచ్చింది. కాంగ్రెసులో కనీసం పదిమందికి పైగా అభ్యర్థులు ఉన్నప్పటికీ, పేరు ప్రకటించేంత సాహసం చేయలేకపోతుందని ప్రతి విమర్శలు చేసింది. తర్వాత దళిత్, లింగాయత్ ముఖ్యమంత్రి నినాదం తెరపైకి వచ్చింది.
అసమ్మతి.. అంతకుమించి
పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ టికెట్లు దక్కని వారు, పార్టీ ఫిరాయించిన వారు, సీనియర్లు, కొత్త ముఖాల అంశంపై చాలా రోజులు ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. ఆ పార్టీలో భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవడంతో వారంతా వేరే పార్టీలో చేరారు. ఇదే సందర్భంగా జగదీష్ షెట్టార్, లక్ష్మణ శవరీ రాజీనామాలు సరికొత్త ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారాయి.
విష సర్పం
ఇక ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కువ ఆసక్తిని, అదే స్థాయిలో చీత్కారాన్ని పొందిన విమర్శ ఏదైనా ఉందంటే అది విష సర్పమే. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయన ఈ మాటతో విమర్శించింది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని. ఈ విమర్శ మొత్తం కర్ణాటక ఎన్నికల ప్రచార శైలిని పూర్తిగా మార్చేసింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చెడిపోయింది. ఇదే అదునుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై చెలరేగిపోయారు. ఆ తర్వాత సోనియా గాంధీని బిజెపి నాయకులు విష కన్య అని ప్రచారం చేశారు. ఇక మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ” నాలాయక్” అంటే పనికిరాని వాడని దర్శించాడు.
జై భజరంగబలి
ఇక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఒక అంశం భారతీయ జనతా పార్టీకి మరింత లబ్ధి చేకూర్చింది. తన మేనిఫెస్టోలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో పాటు బజరంగ్ దళ్ ను కూడా నిషేధిస్తామని ప్రకటించింది. దీంతో భారతీయ జనతా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎదురు దాడికి దిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై ఉన్న కేసులను రద్దు చేశారని, ఆ సంస్థను నిషేధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ గత చరిత్రను తిరిగి తవడం మొదలుపెట్టింది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలోనూ ప్రధానమంత్రి దగ్గర నుంచి స్థానిక నాయకుడి వరకు జై భజరంగబలి అని నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థకు హిందుత్వ సంస్థకు ముడి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను దహనం చేస్తున్నారు. కర్ణాటక ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్ల పై వరాల వర్షం కురుస్తోంది.