Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 224 స్థానాలకు ఎన్నికల సంఘం మే 10న ఒకే రోజు పోలింగ్ నిర్వహించింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2018 ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన యువతి..
ప్రముఖులంతా ఉదయమే తమ ఓటుహక్కు వినియోగించుకోగా, ఓ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకోనహళ్లిలోని పోలింగ్ బూత్ నంబర్ 165లో ఓ వధువు తన ఓటు వేసింది. అయితే ఓవైపు పెళ్లి వేడుక ఉన్నప్పటికీ.. బాధ్యతగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వధువుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారీగా పోలింగ్..
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఉదయం 11 గంటల వరకు భారీగా తరలి వచ్చిన ఓటర్లు మధ్యాహ్నం సమయంలో తగ్గిపోయారు. 3 గంటల వరకు పోలింగ్ కేంద్రాలన్నీ వెలవెలబోయాయి. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు 70 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిసింది. 6 గంటల తర్వాత కూడా ప్రతీ పోలింగ్ బూత్‌లో 20 నుంచి 50 మంది వరకు ఓటర్లు క్యూలైన్‌లో ఉన్నారు. వీరంతా ఓటువేసే అవకాశం కల్పించారు. దీంతో ఓటింగ్ పూర్తయ్యే సమయానికి పోలింగ్ శాతం 75 శాతం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్చిలో షెడ్యూల్..
ఈ ఏడాది మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. మొత్తం ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉండగా.. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లలో పురుషులు 2,67,28,053 మంది, మహిళలు 2,64,00,074 మంది, ఇతరులు 4,927 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 11,71,558 మంది యువ ఓటర్లు, 5,71,281 మంది వికలాంగులు (పీడబ్ల్యూడీ) , 12,15,920 మంది 80 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
బరిలో 2,613 మంది..
కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న 2,613 మంది అభ్యర్థుల్లో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో.. 224 మంది బీజేపీ, 223 మంది కాంగ్రెస్ (మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీకి మద్దతు), 207 మంది జేడీ(ఎస్), 209 మంది ఆప్, 133 మంది బీఎస్పీ, నలుగురు సీపీఐ(ఎం), ఎనిమిది మంది జేడీ(యూ), ఇద్దరు ఎన్సీపీ నుంచి బరిలో ఉన్నారు. 685 మంది రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు (ఆర్‌యూపీపీ) చెందిన వారు కాగా.. 918 మంది స్వతంత్రులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్నాయి.