siddaramaiah: దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ కంటే ముందు కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. గత ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీని ఓడించి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఎన్నికల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కారణమైంది. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు అటు సిద్ధరామయ్య, ఇటు డికె శివకుమార్ తీవ్రంగా పోటీపడ్డారు. అయితే చివరికి సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొగ్గు చూపడంతో.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు సిద్ధరామయ్యకు అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తమాయన రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఇందుకు మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార ( ముడా) కుంభకోణం కారణం. ఈ కేసులో సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం తమకు అందిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించడం కర్ణాటక రాజకీయాలలో కలకలం రేపుతోంది..
సీఎం సతీమణి ప్రమేయం
ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి, పలువురి ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, ఆయన సతీమణి అక్రమాలకు పాల్పడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.. “ముడా భూ కేటాయింపులకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని” సామాజిక కార్యకర్తలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
ఇంతకీ ఏం జరిగింది
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో కెసరే అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ సిద్ధరామయ్య సతీ మనకి మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆమెకు తన సోదరుడు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా “ముడా” ఆ భూమిని తీసుకుంది. దీనికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,288 చదరపు అడుగుల ప్లాట్లు ఆమెకు కేటాయించింది. కెసరే ప్రాంతంతో పోలిస్తే విజయనగరలో భూమికి విపరీతమైన ధర ఉంది. అయితే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూ కేటాయింపు జరగడం విషయం.
సిద్ధరామయ్య ఏమంటున్నారంటే..
ముడా వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.”నా భార్య భూమిని ముడా తీసుకుంది. నా భార్య ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి అర్హురాలు. 2014లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నత కాలం ఆమెకు పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పాను. 2021లో ఆమె మరోసారి దరఖాస్తు చేసుకుంటే.. అప్పటి భారతీయ జనతా పార్టీ విజయనగర లో భూమిని కేటాయించింది. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని భారతీయ జనతా పార్టీ ఒకవేళ భావిస్తే.. ఆ భూమిని వెనక్కి తీసుకొని.. నా భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని” సిద్ధరామయ్య పేర్కొన్నారు.
గవర్నర్ ఇచ్చిన నోటీసుల్లో ఏముందంటే..
తనపై వస్తున్న ఆరోపణలపై వారంలోగా సమాధానం ఇవ్వాలని, విచారణకు ఎందుకు ఆదేశించకూడదో సిద్ధరామయ్య చెప్పాలని గవర్నర్ తాఖీదులు పంపించారు. ఈ నోటీసులు జారీ చేసిన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రివర్గం.. సిద్ధరామయ్య పై విచారణకు అనుమతించొద్దని తీర్మానం చేసింది. నోటీసులు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.. గవర్నర్ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు బిజెపి తెర లేపిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది.
బెంగళూరుకు మల్లికార్జున ఖర్గే
ఈ వ్యవహారం నేపథ్యంలో హుటాహుటిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బెంగళూరు వెళ్లారు. ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు ఫోన్ చేశారు. బిజెపి గవర్నర్ ద్వారా చేస్తున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ అధినాయకత్వం అండగా ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు.