Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రం మొత్తం 71 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా కనిపించిన జనం.. మధ్యాహ్నం బాగా తగ్గిపోయారు. మళ్లీ సాయంత్రానికి పుజుకున్నారు. మొత్తంగా చెదురుముదురు ఘటనలు మినహా కర్ణాటక పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈనెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.
బెంగళూర్‌లో తగ్గిన పోలింగ్ శాతం..
బెంగళూరు పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎండ తీవ్రత కూడా దీనికి ఒక కారణంగా భావిస్తోన్నారు. శాండల్‌వుడ్ హీరోలు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్, జగ్గేష్, అమూల్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ఓటు వేశారు. మొత్తంగా 41 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. దీంతో కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తున్నవారంతా బెంగళూర్ ఓటర్లు ఇంత బద్దకస్తులా అని ఆశ్చర్యపోతున్నారు. కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం గమనార్హం.
అక్కడ అత్యధికం
కర్ణాటక ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని మేల్కొటే అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డయింది. ఇక్కడ 84 శాతం మేర పోలింగ్ జరిగింది. బెంగళూరు శివార్లలోని హొస్కొటె– 83.32, కుణిగల్–81.12 శాతం, శ్రీనివాసపుర–81 శాతం మేర పోలింగ్ రికార్డయింది. బెంగళూరు పరిధిలోని సీవీ రామన్ నగర్–42.1, విజయనగర–45.65, బొమ్మనహళ్లి–45.5, బీటీఎం లేఅవుట్–46.72 మేర పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పం బెంగళూరులోనే నమోదైంది.
గడప దాటని యువత, ఉద్యోగులు..
బెంగళూర్‌లో యువ ఓటర్లు ఎక్కువ. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేస్థాయిలో ఉన్నారు. అయితే వీరిలో సగం మంది కూడా ఓటుహక్కు వినియోగించుకోలేదు. యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో ఎన్నికల సంఘంలోపాటు అధికార, విపక్ష పార్టీలు విఫలమయ్యాయి. దీంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యమంగా యువత, ఉద్యోగులు బుధవారం సెలవు రోజుగా పరిగణించి ఇంటి నుంచి బయటకు రాలేదు.