
Harirama Jogaiah Vs Amarnath: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి కాపులపైనే ఉంది. వారంతా జనసేన వైపు చూస్తుండడంతో నియంత్రించేందుకు అధికార పార్టీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే పవన్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే కాపు సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. సహజంగా ఈ చర్యలు అధికార పార్టీకి రుచించడం లేదు. అందుకే ఏదో ఒక వివాదం చేసి కాపులు జనసేన వైపు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న ఆ మధ్య కాపు రిజర్వేషన్ల కోసం నిరసన దీక్షకు దిగిన సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య విషయంలో ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. రాజకీయ స్థిరత్వం లేని హరిరామజోగయ్య మనసు పవన్ పై మళ్లిందని వైసీపీ మంత్రులు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అనుచిత వ్యాఖ్యాలు చేశారు. దీనిపై హరిరామజోగయ్య స్పందించారు. మంత్రి అమర్నాథ్ కు ఘాటైన వ్యాఖ్యలతో లేఖ రాశారు. దీనికి అదే స్థాయిలో మంత్రి రిప్లయ్ ఇచ్చారు.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రిఅమర్నాథ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆదివారం లేఖ రాశారు. ‘డీయర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా’ అంటూ హరిరామజోగయ్య పేర్కొన్నారు.
అయితే దీనిపై మంత్రి అమర్నాథ్ అంతే స్పీడుగా స్పందించారు. రిప్లయ్ లేఖ రాశారు. సైటైరికల్ గా వ్యాఖ్యానాలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సినవి నాకు చెబుతున్నారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అమర్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు లేఖలు వైరల్ అవుతున్నాయి.

పవన్ పై విరుచుకుపడడంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందుంటారు. ఈ క్రమంలో అమర్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన్ను నవ్వులపాలుచేశాయి. పవన్ తో దిగిన ఫొటో చూపించి.. తనతోనే పవన్ ఫొటో దిగారని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. అటు తన సొంత శాఖల ప్రగతి చెప్పే సమయంలో కూడా ఆయన చెప్పే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు చంద్రబాబు, లోకేష్ లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. చంద్రబాబుకు కాపులను అమ్మేస్తున్నాడంటూ పవన్ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హరిరామజోగయ్య తెరపైకి వచ్చారు. అమర్నాథ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జన సైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.