
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఆ లెక్కన ఆధిపత్య కులాలను పక్కనబెడితే.. జనాభా ప్రాతిపదికన అతి పెద్ద కులంగా ఏపీలో ఉన్నది కాపు సామాజిక వర్గమే. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా.. అందులో దాదాపు మూడొంతుల సీట్లను కాపులు ప్రభావితం చేయగలరన్నది అంచనా. ఈ స్థాయిలో ఉన్న కాపులు రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బాబుకు మెజారిటీగా మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో జగన్ కు జై కొట్టారు. మరి 2024లో ఎవరి వెంట నడుస్తారు? అన్నది ఇప్పటి నుంచే చర్చనీయాంశమైంది.
దీనికి కారణం లేకపోలేదు. ఎలాగైనా అధికారం సాధించాలని భావించిన చంద్రబాబు.. తన పరిధిలో లేని హామీని కూడా వారిపై గుప్పించారు. ముందు ఎన్నికల సంద్రం దాటితే చాలు అనుకొని.. కాపులను బీసీ కేటగిరీలో చేరుస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ.. అది చేయలేకపోయారు. దాని ఫలితం ఎలా ఉందో కాపు ఉద్యమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. మొత్తానికి బాబు తమను మోసం చేశాడని భావించిన కాపులు.. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు.
బీసీలో చేరుస్తాననే హామీని ఇవ్వలేదుగానీ.. కాపు కార్పొరేషన్ కు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పారు సీఎం జగన్. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచాయి. కానీ.. రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో.. సోషల్ మీడియా వేదికగా కాపు సామాజికవర్గం యుద్ధం మొదలు పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తోంది. వెంటనే 4 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడున్న రాష్ట్ర ఖజానా కండీషన్లో ఇది ఎంత వరకు సాధ్యమవుతుందన్నది పెద్ద ప్రశ్న.
అటు బాబును, ఇటు జగన్ ను చూసిన కాపులు.. ఈ సారి పవన్ వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతుండడంతో ఇప్పటికే.. ప్రజల్లో ఉంటున్నాడు అనే అభిప్రాయం పవన్ పై ఏర్పడింది. పైగా.. కాపు సామాజికవర్గానికే చెందిన నాయకుడు కావడంతో.. తమ లీడర్ వెంటనే నడవాలని చూస్తున్నారట కాపులు. బీజేపీ అలయెన్స్ ఉండడం.. అధ్యక్షుడు సోమూవీర్రాజు కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడే కావడం గమనించాల్సిన అంశం.
ఇదే నిజమై.. వచ్చే ఎన్నికల్లో కాపులంతా సమష్టిగా పవన్ వెంట నడిస్తే.. జనసేన-బీజేపీ కూటమి అద్భుతం సృష్టించే అవకాశం ఉందని కూడా చర్చ సాగుతోంది. అయితే.. దీనికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటిలోగా పరిస్థితులు ఎలా మారుతాయి అనేది చెప్పడం కష్టమే. కానీ.. కాపుల ఆన్ లైన్ ఉద్యమం మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయమని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది? అనేది చూడాలి.