
Kanna Lakshminarayana: ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మరికొద్ది గంటల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 500 వాహనాలు, 2000 మంది అనుచరులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్నారు. ఏపీ పొలిటికల్ హీట్ పెంచేలా ఈ చేరికలు ఉండే విధంగా అటు చంద్రబాబు, ఇటు కన్నా ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు చేశారు. కన్నాతో పాటు కొంతమంది కాపు నేతలను సైకిలెక్కించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల నుంచి కన్నాకు ఆహ్వానం ఉన్నా,.ఆయన చివరకు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గుచూపారు.
2014 ఎన్నికలకు ముందు కన్నా వైసీపీలో చేరడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. భారీ కాన్వాయ్ నడుమ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. కన్నాను వైసీపీలోకి వెళ్లకుండా నిలువరించారు. బీజేపీలో చేర్చుకొని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అయితే బీజేపీలో సముచిత స్థానం దక్కినా. గత పదేళ్లుగా ప్రజాప్రతినిధి కాలేకపోయానన్న బాధతో కన్నా ఉన్నారు. టీడీపీలో చేరితో డిప్యూటీ సీఎంతో పాటు కీలక పోర్టుపోలియో అప్పగిస్తామన్నచంద్రబాబు ఆఫర్ తో కన్నా టీడీపీ వైపు మొగ్గుచూపారు. అటు సత్తెనపల్లి నియోజకవర్గ టిక్కెట్ తో పాటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలు కన్నాకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

కాపు నేతగా ముద్రపడిన కన్నా తొలుత జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ ఒకటి రెండుసార్లు కన్నాను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఆయన జనసేనలో చేరిక ఖాయమైందన్న ప్రచారం జరిగింది. కానీ కన్నా అనూహ్యంగా టీడీపీ వైపు వచ్చారు. తనతో పాటు గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది కాపు నాయకులను టీడీపీలో చేర్చేందుకు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జనసమీకరణ భారీగా చేశారని.. భారీ కాన్వాయ్ తో అధికార వైసీపీకి, బీజేపీకి గట్టి సవాలే పంపించేందుకు సిద్ధమయ్యారు.
అయితే కన్నా వెంట మాజీ ఎమ్మెల్య విష్ణుకుమార్ రాజు చేరుతారని భావించినా రాజుగారు వెనక్కి తగ్గారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తేలనందునే రాజుగారు వెనక్కి తగ్గిటనట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో పాటు చాలామంది కమ్మ సామాజికవర్గం నాయకులు టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు అంశం తేలనందున ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఒక వేళ బీజేపీతో పొత్తు కుదిరితే అదే నేతలు బీజేపీ కోటాలో పోటీచేస్తారని.. పొత్తు కుదరకపోతే మాత్రం టీడీపీలోకి వచ్చి ఎన్నికల్లో బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. అంతా చంద్రబాబు అనుకున్న ప్లాన్ ప్రకారమే బీజేపీలో సమీకరణలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.