
Kamineni Srinivas- Chandrababu: గత ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అతి కష్టమ్మీద ప్రతిపక్షానికి చేరుకుంది. అయితే టీడీపీని బలహీనమైన ప్రతిపక్షంగా భావించిన బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీపై ఆకర్ష్ ప్రారంభించక ముందే తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీ హైకమాండ్ కు గిఫ్ట్ గా ఇచ్చేశారు. అటు తరువాత చిన్నాచితకా నాయకులను సైతం కాషాయదళంలోకి సాగనంపారు. హైకమాండ్ పెద్దలకు తనపై కోపం రాకుండా చూసుకోవాలని వారికి టాస్క్ ఇచ్చారు. భవిష్యత్ లో బీజేపీతో పొత్తుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని లోపయికారీగా పురమాయించారు. అయితే మనసు నిండా పసుపురంగు ఉంచుకొని కషాయదళంలోకి వెళ్లిన వారు కొన్ని విషయాల్లో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు పొత్తు విషయంలో బీజేపీ టీడీపీతో కలిసి రాకపోవడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. హైకమాండ్ పెద్దలను కీర్తిస్తూనే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కార్నర్ చేసుకొని ఒక్కో నేతను టీడీపీ గూటిలోకి రప్పిస్తున్నారు.
తాజాగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరిపోయారు. అటు తరువాత విష్ణుకుమార్ రాజు పేరు వినిపించింది. ఎందుకో ఆయన కాస్తా తగ్గినట్టు కనిపించినా.. ఇప్పుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. చంద్రబాబు పాలనలో ఈయన కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ పోర్టుఫోలియోను దక్కించుకున్నారు. దీని వెనుక పెద్ద కథ నడిచినట్టు ప్రచారంలో ఉంది. కామినేని కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఆది నుంచి టీడీపీలో చేరాలని భావించారు. 2014 ఎన్నికల్లో తన సన్నిహితుడైన పవన్ ద్వారా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వరకూ మాత్రమే కాగలరని.. బీజేపీలో చేరితే ఆ కోటాలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి దక్కించుకోవచ్చని సలహా ఇచ్చారు. సేమ్ అలానే సాగిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కథ అడ్డం తిరిగింది. అప్పటి నుంచి బీజేపీలో యాక్టివ్ గా లేకున్నా.. యాక్టివ్ రాజకీయాల వైపు కామినేనికి యావ తగ్గలేదు.

ఇటీవలే హైదరబాద్ లో కామినేని సినీ, రాజకీయ సెలబ్రెటీల మధ్య జన్మదిన వేడుకలు చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈయన నామ్ కే వాస్తుగా బీజేపీలో ఉన్నా చంద్రబాబు నాయకత్వం కింద పనిచేయాలన్న ఆరాటం ఎక్కువ. అయితే ఇలా కామినేని లాంటి వాళ్లను చేర్చుకుంటున్న చంద్రబాబు వారి చేతిలో ఒక స్క్రిప్ట్ పెడుతున్నారు. బీజేపీ హైకమాండ్ పై భయంకరమైన భక్తి చాటుతూనే.. బీజేపీతో పొత్తుకు అడ్డంకిగా ఉన్న సోము వీర్రాజుకు రాజకీయ భవిష్యత్ చేయకూడదన్న రీతిలో స్టేట్ మెంట్ ఇస్తున్నారు. తాము పార్టీ మారడానికి వీర్రాజే కారణం తప్ప మరెవరూ కారణం కాదన్న రీతిలో సూసైడ్ లెటర్ తరహాలో ఒక ప్రకటన ఇప్పిస్తున్నారు. మొత్తానికైతే బీజేపీలో ఉంటూ పసుపు పార్టీని ఆరాధించే నేతల ముసుగును చంద్రబాబు బయటకు తీస్తున్నారు. చేస్తున్నది ఆకర్ష్ అయినా అది సోము వీర్రాజు వైపల్యంగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు.