Homeజాతీయ వార్తలుKamareddy farmers strike : అన్నదాతలకు కడుపు మండింది.. ఏకంగా కేటీఆర్ కే లీగల్ నోటీసులు...

Kamareddy farmers strike : అన్నదాతలకు కడుపు మండింది.. ఏకంగా కేటీఆర్ కే లీగల్ నోటీసులు పంపారు

Kamareddy farmers strike : నాలుగు రోజుల నుంచి కామారెడ్డిలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఓవైపు బిజెపి, మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న యాగితో ఆ పట్టణం ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది.. నువ్వంటే నువ్వు కారణమని తిట్టుకుంటున్న రాజకీయ పార్టీలు అసలు విషయాన్ని పక్కన పెడుతున్నాయి.. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు కామారెడ్డి పెద్ద అగ్రి హబ్.. ఇక్కడ మొక్కజొన్న, పసుపు విస్తారంగా పండుతాయి. కామారెడ్డి పసుపు మార్కెట్లో హాట్ కేక్. అయితే కామారెడ్డి పట్టణాన్ని ఏడు గ్రామాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్ రూపొందించడమే అసలు సమస్యకు ప్రధాన కారణం.. పైగా మూడు పంటలు పండే రైతుల భూముల్లో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లకు ప్రతిపాదన చేయడమే నెత్తి మాసిన ఆలోచన. దీనికి తోడు 2,700 ఎకరాల వ్యవసాయ భూమిని చేర్చడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇక దీనిని మొదటి నుంచి బిజెపి టాకిల్ చేసుకుంటూ వస్తోంది. అఫ్కోర్స్ ఈ క్రెడిట్ మొత్తం అక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ కు దక్కుతుంది.. అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంది.

ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో..

ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుతో తన భూమి పోతుందని కామారెడ్డి ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.. దీంతో రైతులకు రాజకీయ పార్టీలు బాసటగా నిలిచాయి.. అప్పటికీ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 1365 కు పైగా అభ్యంతరాలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ స్థాయిలో రైతులు ఆగ్రహం ఉన్నప్పుడు అధికారులు ఎందుకు ముందుకు వెళ్తున్నారని దానిపై స్పష్టత లేదు. ఇక కామారెడ్డి ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి విస్తరిస్తోంది.. ప్రభుత్వం శివారు గ్రామాలను కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేసింది. సరంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, టేక్రియల్, ఇల్చి పూర్, అడ్లూరు, రామేశ్వర్ పల్లి, పొరుగు మండలమైన సదాశివనగర్ లోని అడ్లూర్ ఎల్లారెడ్డి కి చెందిన భూములను పట్టణంలో కలుపుతూ అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.. ఇక ఇందులో పట్టణ విస్తీర్ణం 61.55 చదరపు కిలోమీటర్లు గా చూపారు.. రెసిడెన్షియల్ ఏరియా 6,806 ఎకరాలు, కమర్షియల్ ఏరియా 557 ఎకరాలు, మల్టీ పర్పస్ 667 ఎకరాలు, ప్రభుత్వ భవనాలు, స్థలాలు 635 ఎకరాలు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం 1,455 ఎకరాలు, ఇండస్ట్రియల్ ఏరియా 1,210 ఎకరాలుగా ప్రతిపాదించారు..

రైతులను ముంచే ప్లాన్

ఇండస్ట్రియల్ జోన్ లో అడ్లూరు ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, టేక్రియాల్, కామారెడ్డి, అడ్లూరు గ్రామంలోని 600 పైగా రైతు కుటుంబాలకు చెందిన 1,195 ఎకరాల భూములను చేర్చారు. రామేశ్వర్ పల్లి, లింగాపూర్, టేక్రియాల్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూముల నుంచి రోడ్లకు 700 ఎకరాలు, గ్రీన్ జోన్ లో 900 ఎకరాలు చేర్చారు.. అయితే వీటిలో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్, రోడ్ల నిర్మాణానికి గుర్తించిన భూములన్నీ విలువైనవే. ఇవన్నీ కూడా పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.. ఆ భూమి లో నుంచి వంద ఫీట్ల రోడ్డు తీస్తే మిగిలేది ఏముంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టుకు వెళ్లారు

ఈ మాస్టర్ ప్లాన్ పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. 558 మంది రైతులు లీగల్ నోటీసులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఇతర అధికారులకు పంపారు.. ఇక వీటిపై మున్సిపల్ కార్యాలయానికి 1,026 అభ్యంతరాలు వచ్చాయి. కాగా మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాస్టర్ ప్లాన్ ప్రదర్శించారు.. దీనిపై గత 25 రోజుల నుంచి బాధిత గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇక ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఇందులోకి బిజెపి ఎంటర్ కావడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అయితే హైకోర్టు దీనిపై త్వరలో విచారించే అవకాశం కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular