ఎంపీలో ముదురుతున్న సంక్షోభం..

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను మంగళవారమే నిర్వహించాలన్న గవర్నర్‌ లాల్జి టాండన్‌ ఆదేశాన్ని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఖాతరు చేయకపోవడంతో వివాదం సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చింది. అంతకు ముందు సోమవారం బలపరీక్ష జరపాలన్నా గవర్నర్ ఆదేశాన్ని స్పీకర్ ప్రజాపతి సహితం లెక్క చేయకుండా కరోనా వైరస్ సాకుతో సమావేశాలను 26 వరకు వాయిదా వేయడం తెలిసిందే. మరోవంక, వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ను […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 4:40 pm
Follow us on

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను మంగళవారమే నిర్వహించాలన్న గవర్నర్‌ లాల్జి టాండన్‌ ఆదేశాన్ని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఖాతరు చేయకపోవడంతో వివాదం సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చింది. అంతకు ముందు సోమవారం బలపరీక్ష జరపాలన్నా గవర్నర్ ఆదేశాన్ని స్పీకర్ ప్రజాపతి సహితం లెక్క చేయకుండా కరోనా వైరస్ సాకుతో సమావేశాలను 26 వరకు వాయిదా వేయడం తెలిసిందే.

మరోవంక, వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల తరపున ఎవరూ విచారణకు హాజరు కాకపోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున విచారణకు హాజరు కాకపోవడంపై స్పందన తెలియజేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతుగా ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. దానితో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు.

వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వతంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం కాగలదు.