MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీరోల్ తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వాసురాలు, కల్వకుంట్ల కవితే పోషించినట్లు ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. సౌత్‌గ్రూప్ మొత్తాన్ని లీడ్చేసింది కవితే అని ఇప్పటికే ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పలు చార్జిషీట్లలో స్పష్టం చేసింది. ఈమేరకు ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది. దీంతో కవితకు దారులన్నీ మూసుకుపోతున్నాయి. గురువారం రెండోసారి విచారణకు హాజవుతున్న కవిత, చట్టప్రకారం ఎలా తప్పించుకోవచ్చని అన్ని మార్గాలు అన్వేషించింది. ఏ చాన్స్ మిస్ చేసుకోవద్దని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించింది.
ఈడీ నోటీసులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ..
లిక్కర్ స్కామ్ కేసులో గురువారం తమ ఎదుట హాజరుకావాలన్న ఈడీ నోటీసులపై స్టే కోసం కవిత బుధవారం పిటిషన్ వేశారు. కానీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ నిరాకరించింది. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించలేమని తేల్చిచెప్పింది. కేసు దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఫోన్ లాక్కున్నారని ఆరోపణ..
సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కవిత పలు అంశాలు ప్రస్తావించారు. తాను కేసీఆర్ కూతుర్నని, గతంలో ఎంపీగా, ప్రస్తుతం నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్నానని తెలిపింది. గతంలో ఎంపీగా వివిధ పార్లమెంట్ కమిటీల్లో ఉన్నానని పేర్కొంది. అలాంటి తనను కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ వేధిస్తుందని ఆరోపించారు. ఈనెల 11న జరిగిన విచారణ టైంలో తన ఫోన్ బలవంతంగా ఈడీ అధికారులు సీజ్ చేశారని తెలిపింది. ఫోన్ సీజ్ చేసిన టైంలోనూ వివరణ తీసుకోలేదు. ఎందుకు ఫోన్ తీసుకున్నారో చెప్పలేదని వివరించింది. రాత్రి 8.30 గంటల వరకు విచారించారని తెలిపింది. భౌతికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని పేర్కొంది.
ఇంట్లో విచారణ జరిపేలా ఆదేశించాలని..
కేసులో విచారణను తన నివాసంలో కానీ, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ జరిపేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదే కేసుకు సంబంధించి సీబీఐ నిరుడు డిసెంబర్ 11న హైదరాబాద్ లోని తన నివాసంలో దాదాపు ఏడు గంటలు విచారణ జరిపిందని తెలిపారు. విచారణ సందర్భంలో ఈడీ థర్డ్ డిగ్రీ, బలవంతపు వ్యూహాలను అవలంబిస్తున్నదని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు లిక్కర్ స్కామ్ కేసులో సాక్షి చందన్రెడ్డితో ఈడీ అధికారులు ప్రవర్తించిన విధానమే నిదర్శనమన్నారు. తన విషయంలోనూ ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరిం చిందని కవిత ఆరోపించారు. కేసు ఎఫ్ ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని, కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈడీ అధికారాలేంటి?
కవిత సుప్రీం కోర్టులో ఈడీ విచారణపై స్టే కోసం పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈడీ అధికారాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు.. ఏం చేస్తావో చేసుకో.. ఏ కేసులకు భయపడేది లేదు అంటుంటారు. అలాంటి వారు కూడా ఈడీ అనగానే కాస్త వెనకడుగు వేయడం ఖాయం. ఈడీ పేరు చెప్పగానే… ప్రముఖ వ్యక్తులు అయినప్పటికీ వణికిపోతుంటారు. సీబీఐ, ఐటీ ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి..? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా..? అన్న చర్చ జరుగుతోంది.
రెండు చట్టాలపైనే ఈడీ..
ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..! ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పని చేస్తుంది. ఒకటి ఫెమా, మరొకటి పీఎంఎల్ఏ.
ఫెమా అంటే ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ – 1999. ఇది సివిల్ చట్టం. ఫెమాలో ఫారెన్ ఎక్సేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. ఇక పీఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ మనీ లాండరింగ్ యాక్ట్–2002. ఇది క్రిమినల్ చట్టం. ఇందులో భాగంగా చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించి.. చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని.. ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ.
ఈడీకి మూడు సూపర్ పవర్స్..
కల్వకుంట్ల కవితకు పీఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ యాక్ట్ కింద ఈడీకి మూడు సూపర్ పవర్స్ ఉంటాయి.
– కోర్టు పర్మిషన్ లేకుండా ఎవరి ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేయవచ్చు. దేశంలో మరే ఏజెన్సీకి ఈ అధికారం లేదు. కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఎవరి ఇంట్లో, ఆఫీస్ లో నైనా రైడ్స్ చేయవచ్చు.
– సీబీఐగానీ, ఇతర పోలీసులు డిపార్ట్ మెంట్స్ గానీ విచారణలో ఉన్నవారితో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. కానీ.. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం.. ఆ స్టేట్ మెంట్స్‌ను కోర్టులో సాక్ష్యాలుగా పరిగణించరు. అంటే.. నిందితులు చెప్పిన స్టేట్మెంట్కు మళ్లీ పోలీసులు సాక్ష్యాలు చూపించాలి. ఈడీకి అలా కాదు. పీఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 50 అండర్ 2 ప్రకారం.. ఈడీ ఎవరి స్టేట్మెంట్ రికార్డు చేసిందనుకోండి, అది కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారు. ఒకవేళ.. ఆ వ్యక్తి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారనుకోండి. మళ్లీ అతడి మీదే చర్యలు తీసుకుంటారు తప్ప ఈడీ అధికారులకు దీనితో ఏ సంబంధం ఉండదు.
– సాధారణంగా చట్టం ఏం చెబుతోంది.. నేరం రుజువు కానంత వరకు ఎవరైనా నిర్దోషిగా ఉంటారు..! కానీ.. ఈడీలో అలా కాదు. రివర్స్‌లో ఉంటుంది. మీరు నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషే. అంటే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న కవిత ఈడీ దృష్టిలో దోషే.
మహిళా సెంటిమెంట్..
ఇక కవితకు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో మహిళా సెంటిమెంట్ రగిల్చేందుకు కవిత సన్నద్ధమయ్యారు. ఒకవైపు వణికిపోతూనే చివరిగా మహిళా సెంటిమెంట్‌ను ప్రజల్లోకి వదలాలని, అవసరమైతే మీడియా ముందు కన్నీళ్లు కూడా పెట్టుకోవాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. ఈ క్రమంలోనే కవితకు ఒక్కసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా గుర్తుకు వచ్చింది. లిక్కర్ స్కాం ద్వారా కవిత ఎక్కువగా మహిళల్లోనే చులకన అయ్యారు. మహిళ సారా దందా చేయడం ఏంటి అన్న అభిప్రాయం తెలంగాణ మహిళల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తన కన్నీటితో తనను దూషిస్తున్న మహిళలతోనే పాపం కవిత అనిపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణకు వెళ్లే ముందు.. కవిత ప్రెస్‌మీట్ ఉద్దేశం కేవలం సెంటిమెంట్ కోసమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. స్కాం చేసినప్పుడు తాను మహిళను.. లిక్కర్ స్కాం చేయడం తప్పు.. దొరికితే పరువు పోతుంది అన్న విషయం మర్చిపోయిన కవిత.. ఇప్పుడు మహిళా సెంటిమెంటు రగిలించాలని చూడడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kalvakuntla kavitha is using all the opportunities of the law
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com