Nature Safari: పట్టణీకరణ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో మనుషులకు స్వచ్ఛమైన గాలి కూడా కరువవుతోంది. ఒకప్పుడు ప్రకృతి అందాలకు ఆలవాలమైన గ్రామాలు కూడా అభివృద్ధి బాట పడుతుండడంతో ప్రస్తుత తరానికి వేటి గురించి సరైన అవగాహన ఉండటం లేదు. అడవుల గురించి అస్సలు తెలియడం లేదు. దీంతో అడవుల్లో విహరించేందుకు తెలంగాణ ప్రాంత వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. పర్యాటక ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. అయితే తెలంగాణలో కూడా దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఆఫ్రికాలో అడవుల్లో చేసినట్టు సఫారీ చేయవచ్చు.అయితే అవకాశాన్ని పర్యాటకులకు కలిగించేందుకు తెలంగాణ అటవీశాఖ ముందుకు వచ్చింది. తెలంగాణలో దట్టమైన అటవీ ప్రాంతం గా పేరుపొందిన కడెంలో నేచర్ సఫారీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది. దీని ద్వారా గణనీయంగా ఆదాయం లభిస్తుందని అంచనాలు వేస్తోంది. అదేవిధంగా అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచి భవిష్యత్తులో ఆఫ్రికన్ సఫారీ మాధురి అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
సందర్శకుల తాకిడి ఎక్కువ
నేచర్ సఫారీ పర్యాటక ప్రాంతమైన కడెం కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా వస్తూ ఉంటారు. ప్రాజెక్టు బోట్లలో ప్రయాణం సాగిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అటవీ అధికారులు కొత్తగా నేచర్ సఫారీ కి రంగం సిద్ధం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.
వాచ్ టవర్ల ఏర్పాట్లు
అడవుల్లో అందాలు వీక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. కడెం మండలంలోని గంగాపూర్, అల్లంపల్లి, లక్ష్మీపూర్, పాండవ పూర్ ప్రాంతాల్లో చూడ చక్కని రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. దోస్త్ నగర్ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో “ఐ లవ్ కవ్వాల్” టైగర్ రిజర్వ్ లోగోను ఆవిష్కరించారు.. ఇది నిర్మల్ _ మంచిర్యాల రహదారి పక్కన ఉంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ మూడు జిల్లాలను కలిపే ఈ ప్రాంతానికి దగ్గరలో దీనిని ఏర్పాటు చేయగా, రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు లోగో దగ్గర ఆగుతూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ లోగో ప్రాంతం నుంచి కడెం అడవుల్లో పర్యటించేలా నేచర్ సఫారీ ఏర్పాటు చేశారు. ఇటీవల దీనిని అటవీశాఖ పిసిసిఎఫ్ ప్రారంభించారు.

జంతువులు పెరుగుతున్నాయి
ఇక కడెం, కవ్వాల్ ప్రాంతంలో అటవీ జంతువుల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక భారీ బైసన్ రావడమే ఇందుకు ఒక ఉదాహరణ. ఈ అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ టైగర్ ద్వారా భారీగా నిధులు వస్తుండడంతో పులుల సంరక్షణ చర్యలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో పర్యాటకులు ఎక్కడికో వెళ్లి నేచర్ సఫారీ ఆస్వాదించే కంటే, సొంత రాష్ట్రంలోనే ఆ వెసలు బాటును అటవీ శాఖ కల్పిస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది.