KA Paul: “మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది. లేకుంటే శపించి ఉండేవాడిని”.. ఆ మధ్యన అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం చెప్పే పవర్ ఫుల్ కామెడీ డైలాగు ఇది. ఇప్పుడు అచ్చం ఈ డైలాగును గుర్తు చేస్తున్నారు కేఏ పాల్ . నా శాపంతో ఏడుగురు పోయారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ ఎవరిని ఉద్దేశించో తెలుసా? ఏపీ సీఎం జగన్ ను. ఓ స్థాయిలో ముఖ్యమంత్రి తీరుపై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ గా మారాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరం నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో కేఏ పాల్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీనిని పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇది కేఏ పాల్ కడుపు మంట కారణమైంది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్ను ఎడాపెడా తిట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఒక్క సీటు కూడా రానివ్వనని హెచ్చరించారు. ఇప్పటికే ఈ తరహా హెచ్చరికతో లక్ష్మీపార్వతి చంద్రబాబు, పురందేశ్వరిలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఆమె హెచ్చరికలే సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. దీనికి కే ఏ పాల్ హెచ్చరికలు తోడయ్యాయి.
కేఏ పాల్ తన మార్కు జులుం చూపించారు. ఒరేయ్ జగన్ అని తనతో అనిపించుకోవద్దని హెచ్చరించారు. పవన్ మాట్లాడితే రాజకీయ స్పీచ్ అవుతుందని.. తాను మాట్లాడితే మాత్రం దైవ శాపంగా మారుతుందని.. జాగ్రత్తగా ఉండాలని జగన్ కు హితవు పలికారు. తనను అరెస్టు చేసిన సీఐ రామారావు, ఎస్సైలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలనని హెచ్చరికలు జారీ చేశారు.
అయితే కేఏ పాల్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. గత కొద్దిరోజులుగా ఆయన జగన్కు వెనుకేసుకొస్తున్నారు. వివేకా హత్య కేసులో జగన్ తో పాటు అవినాష్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. మీడియా ప్రకటనలు, వీడియోలను విడుదల చేశారు. అటువంటి కేఏ పాల్ విశాఖలో శాంతియుతంగా నిరసన దీక్ష చేపడుతుంటే పోలీసులు భగ్నం చేశారు. జగన్ స్థాయిలో పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అసలు తత్వం బాధపడినట్లుంది. అందుకే ఒరేయ్ తురేయ్ అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేఏ పాల్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.